అబుదాబి : ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్-2020 సీజన్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడంటే మూడే మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికల్లో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఫేలవమైన ఆటతీరుతో అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డిండ్‌లో బలమైన జట్టుగా పేరొందిన సీఎస్‌కే.. తాజా సీజన్‌లో బలహీనమైన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. కొన్ని మ్యాచ్‌ల్లో వాట్సన్, డుప్లెసిస్ మెరిసినప్పటికీ.. కీలకమైన మ్యాచ్‌ల్లో చేతులెత్తేడం టీం విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో రాయుడు, ధోనీ, జాదవ్, జడేజా ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారించిన దాఖలాలు లేవని చెప్పక తప్పదు. (బ్యాటింగ్ చేయడు... బౌలింగ్ చేయలేడు!)
సీజన్ మొదటి మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించిన రాయుడు.. ఆ తరువాత ఒకటి అర ఇన్సింగ్స్‌కే పరిమితం అయ్యాడు. దాదాపు 8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన జాదవ్.. ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు మాత్రమే చేశాడంటే ఆయన ప్రదర్శన ఏంటో అర్థమవుతుంది. మరోవైపు సోమవారం అబుదాబి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే దారుణ పరాజాయాన్ని ముటగట్టుకుని ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బాధ్యతగా ఆడాల్సిన ఆటగాళ్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ.. చేతులెత్తేశారు. సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కేధార్ జాదవ్, అంబటి రాయుడు తీవ్రంగా నిరాశపరిచారు. కనీసం పోరాట పటిమను కూడా ప్రదర్శించకుండా రాజస్తాన్ బౌలింగ్‌కు కుప్పకూలి సీజన్‌లో అత్యల్ప స్కోర్‌కు పరిమితం అయ్యారు. బౌండరీలు బాదుడు సంగతి అలాఉంచితే వికెట్ల మధ్య పరుగులు రాబట్టడమే సీఎస్‌కే ఆటగాళ్లకు కష్టతరంగా మారింది.
మరీ ముఖ్యంగా సారథి ధోనీ ఆటపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ.. ధోనీ ఆట తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లే ఐపీఎల్ నుంచి కూడా వైదొలుగా ధోనీ అంటూ పోస్టులు పెడుతున్నారు. దుమ్ము రేపుతాడు అనుకున్న తమ అభిమాన ఆటగాడు సింగిల్స్‌కే పరిమితం కావడం చూడలేకపోతున్నామని బాధను పంచుకుంటున్నారు. దూకుడైన ఆటతీరుకు మారుపేరుగా చెప్పుకునే జార్ఖండ్ డైనమేట్‌పై జాలి వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ధోనీ, జాదవ్‌లను ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో జోక్స్ పేలుస్తున్నారు. జట్టును గెలిపించడానికి ధోనీ పడుతున్న కష్టాన్ని చూసి జీర్ణించుకోలేపోతున్నామని మీమ్స్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ టీం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ... ‘ఈ సీజన్‌లో మేం ఇక ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4–5 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో’ అంటూ సెలవిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment