IPL 2023, RR Vs CSK: MS Dhoni Played Well 32 Runs Not Out 17 Balls In 200 Match - Sakshi
Sakshi News home page

MS Dhoni: కాస్త ముందొచ్చినా బాగుండు.. ఓడినా అలరించాడు

Published Wed, Apr 12 2023 11:48 PM | Last Updated on Thu, Apr 13 2023 8:29 AM

MS Dhoni Played Well 32 Runs Not-out-17 Balls In 200 Match-CSK Captain - Sakshi

Photo: IPL Twitter

సీఎస్‌కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌ ఆడిన ఎంఎస్‌ ధోని తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే మూడు పరుగుల తేడాతో తృటిలో ఓడినప్పటికి ధోని మాత్రం తన వింటేజ్‌ ఆటతో చెపాక్‌ స్టేడియాన్ని హోరెత్తించాడు.

ముఖ్యంగా సందీప్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో ధోని కొట్టిన రెండు సిక్సర్లు మ్యాచ్‌కే హైలెట్‌ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ఎత్తులో వెళ్లడంతో అసలు సిక్సర్లేనా అన్న సందేహం కలగక మానదు. కానీ అక్కడ కొట్టింది ఎవరు ధోని.. అందుకే కాబోలు ప్రత్యర్థి కెప్టెన్‌ శాంసన్‌ ధోని ఆటను చూస్తూ ఉండిపోయాడు. 

అయితే ధోని మ్యాచ్‌లో కాస్త ముందొచ్చి ఉంటే బాగుండని అభిమానులు వాపోయారు. వాస్తవానికి రాయుడు వచ్చిన నాలుగో స్థానంలో ధోని వచ్చి ఉంటే సీఎస్‌కే గెలిచేదేమో. ఎందుకంటే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధోని తన దనాధన్‌ ఆటతో మునపటి ధోనిని తలపించాడు. కనీసం రెండు ఓవర్ల ముందు వచ్చినా మ్యాచ్‌ సీఎస్‌కే గెలిచేది.. కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌ ఆడుతున్న ధోనికి విజయం మధురానుభూతిగా మిగిలిపోయి ఉండేదని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఇక ధోని క్రీజులోకి వచ్చే సమయానికి సీఎస్‌కే స్కోరు 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు. చివరి ఐదు ఓవర్లలో దాదాపు 63 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయితే ధోని, జడేజాలు క్రీజులో ఉండడంతో సీఎస్‌కే గెలుస్తుందనే ఆశ అభిమానుల్లో ఉంది. అయితే 16, 17 ఓవర్లు చప్పగా సాగాయి.  అయితే ఆట 18వ ఓవర్లో జడేజా గేర్‌ మార్చి రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడంతో ఆఖరి ఓవర్లో సమీకరణం ఆరు బంతుల్లో 21 పరుగులుగా మారింది.

సందీప్‌ శర్మ ఒత్తిడిలో తొలి బంతిని వైడ్‌ వేయడంతో ఆరు బంతుల్లో 20 పరుగులు అవసరం అయ్యాయి. తొలి బంతికి పరుగు రాలేదు. అంతే అభిమానుల్లో నిశ్శబ్దం. కానీ ఫుల్‌టాస్‌ పడిన రెండో బంతికి ధోని అంతే ఫ్లాట్‌గా సిక్సర్‌ కొట్టాడు. ఆ తర్వాత మూడో బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా మరో సిక్సర్‌. నాలుగో బంతికి సింగిల్‌ తీశాడు. దీంతో సమీకరణం రెండు బంతుల్లో ఆరు పరుగులు అయింది.

జడేజా ఐదో బంతిని సింగిల్‌ తీయడంతో ఒక్క బంతికి ఐదు పరుగులు అవసరం అయ్యాయి. అయితే ప్రతీసారి ఆట మనకు అనుకూలంగా ఉండదు.. అందుకే సందీప్‌ ఆఖరి బంతిని యార్కర్‌ వేయడం.. ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయడంతో  సీఎస్‌కే మూడు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా 200వ మ్యాచ్‌లో 
తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement