పొట్టి క్రికెట్ అంటేనే సిక్సర్లకు పెట్టింది పేరు. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు పోటీపడి మరీ సిక్సర్లు బాదుతుంటారు. ఒకటి అరా సందర్భాల్లో తప్ప దాదాపు ప్రతి మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ తప్పక ఉంటుంది. ఐపీఎల్ వచ్చాక బ్యాటర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇన్నింగ్స్ తొలి బంతా, ఆఖరి బంతా.. స్పిన్ బౌలరా, ఫాస్ట్ బౌలరా అన్న తేడా లేకుండా ఎడాపెడా సిక్సర్లు బాదేస్తున్నారు. ఒక్కో మ్యాచ్‌లో సగటున 10 నుంచి 20 సిక్సర్లు వస్తుంటాయి. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, పోలార్డ్, వార్నర్ లాంటి భారీ హిట్టర్లయితే ఆడింది 200లోపు మ్యాచ్‌లే అయినా మ్యాచ్‌ల సంఖ్యకు మించి సిక్సర్లు కొట్టారు.
మ్యాచ్‌లో ఏదో ఒక సందర్భంలో సిక్సర్ కొట్టడం ఒకెత్తైతే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సిక్సర్లు బాదడం మరో ఎత్తు. ఆఖరి ఓవర్ అనగానే సహజంగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తెగువ చూపి సిక్సర్లు బాదడం మన మహేంద్రుడికే చెల్లింది. అందుకే అతను చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా చివర్లో ధోని కొట్టినన్ని సిక్సర్లు కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రికార్డు స్థాయిలో 57 సిక్సర్లు బాదాడు.
ధోని తర్వాత పోలార్డ్ అత్యధికంగా 33 సిక్సర్లు, రవీంద్ర జడేజా 26, హార్ధిక్ పాండ్యా 25, రోహిత్ శర్మ 23 సిక్సర్లు కొట్టారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ 142 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఏబీ డివిలియర్స్ (251), రోహిత్ శర్మ (245), ధోని (235), కోహ్లి (227) ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని 17 బంతుల్లో 3 సిక్సర్లు, ఫోర్ సాయంతో అజేయమైన 32 పరుగులు సాధించినప్పటికీ సీఎస్‌కే గెలువలేకపోయింది. ధోని, జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చివరివరకు అద్భుతంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సందీప్ శర్మ ఆఖరి మూడు బంతులను అద్భుతంగా బౌల్ చేసి ధోని, జడ్డూలను కట్టడి చేశాడు. ఫలితంగా ఆర్‌ఆర్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment