ఎమ్మెస్కే ప్రసాద్(ఫైల్ ఫొటో)
MSK Prasad Comments On Rahul Dravid And Dhoni: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నాడన్న వార్తల నేపథ్యంలో... కొత్త కోచ్ ఎవరన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. కుంబ్లే పేరును బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రతిపాదించినప్పటికీ.. తనకు ఈ పదవిపై ఆసక్తి లేదని కుంబ్లే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. బీసీసీఐ విదేశీ కోచ్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు. స్పోర్ట్స్‌తక్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘ద్రవిడ్ కోచ్‌గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రవి భాయ్ యుగం ముగిసిన తర్వాత.. ఎంఎస్ ధోని మెంటార్‌గా, ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని నా సహచర కామెంటేటర్లతో ఛాలెంజ్ చేశా. ఐపీఎల్ కామెంట్రీ చేస్తున్న సమయంలో ఈ విషయాలు చర్చకు వచ్చాయి.
కోచ్‌గా ద్రవిడ్, మెంటార్‌గా ధోని ఉంటే భారత క్రికెట్‌కు అదొక వరంలా మారుతుంది. ఇద్దరూ కూల్‌గా ఉంటారు. అందులో ఒకరు(ద్రవిడ్) మరీ హార్డ్ వర్కర్. ఇండియా ఏ జట్టులో చాలా మంది ఇప్పటికే ఆయన శిక్షణలో రాటుదేలుతున్నారు. నేను అనుకున్నట్లుగా ధోని మెంటార్, ద్రవిడ్ కోచ్ కాకపోతే నేను నిరాశచెందుతాను’’ అని చెప్పుకొచ్చాడు. 2017లో భారత జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన రవిశాస్త్రి హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించిన సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేదు.
Comments
Please login to add a commentAdd a comment