Mumbai- Sarfaraz Khan: ‘‘ఆటను కొనసాగిస్తూ ఉండు. మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉండాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఇప్పటికైనా సర్ఫరాజ్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి’’ అని ముంబై మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ మిలింద్ రేగె మండిపడ్డాడు.
దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సెలక్షన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదన్నాడు. అనవసర విషయాలపై కాకుండా బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని హితవు పలికాడు. పరుగులు సాధిస్తూ ఉండటమే బ్యాటర్ పని, ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుందంటూ సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఎన్ని సెంచరీలు చేసినా..
రంజీ ట్రోఫీ 2022-23 టోర్నీలో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనైనా అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన సర్ఫరాజ్ ఖాన్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తన ఆవేదన పంచుకున్నాడు.
అప్పుడేమో అలా..
తానూ మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయని ఉద్వేగభరితంగా మాట్లాడాడు. గతంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తనను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా రంజీ టోర్నీలో భాగంగా అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలో ఉన్నపుడు తన తండ్రితో కలిసి ప్రాక్టీసు చేశానని పేర్కొన్నాడు.
చోటు లేదు ఏం చేస్తాం?
ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ వ్యాఖ్యలపై స్పందించిన మిలింద్ అతడిని విమర్శించాడు. ముంబై కోచ్ అమోల్ మజుందార్‌తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సర్ఫరాజ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అతడికి చోటు లేదు.
తను అత్యద్భుతంగా ఆడుతున్నాడనే నిజం. అయితే, ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. అప్పుడు తనను తాను నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడు జాతీయ జట్టులో అసలు చోటెక్కడిది? అయినా, ఈ విషయంలో సర్ఫరాజ్ వ్యాఖ్యలు సరికావు. తన దృష్టి బ్యాటింగ్‌పై మాత్రమే ఉండాలి.
అమోల్ నీ కోచ్‌గా ఉండగా
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 11 వేల పరుగులు సాధించిన అమోల్‌కు ఒక్కసారి కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. అప్పటికి టీమిండియాలో చోటు లేకపోవడంతో తనకు నిరాశే ఎదురైంది. అయినా తను ఆటను కొనసాగించాడు. అమోల్‌ను చూసి సర్ఫరాజ్ నేర్చుకోవాల్సి ఉంది. అయినా, అమోల్ నీ కోచ్‌గా ఉండగా.. మీ నాన్నతో ఏం పని? ఆయన నీకు కోచింగ్ ఇస్తున్నారని ఓ పత్రికలో చదివా! అసలు ఏంటిది?’’ అంటూ మిడ్- డేతో మాట్లాడుతూ 73 ఏళ్ల మిలింద్ అసహనం వ్యక్తం చేశాడు.
అంటే ఎప్పటికీ టీమిండియాకు సెలక్ట్ కాడా?
కాగా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి మేటి ఆటగాళ్లు జట్టులో వరుస అవకాశాలు దక్కించుకున్న తరుణంలో అమోల్‌కు భంగపాటు తప్పలేదు. ఇక మిలింద్ రేగె వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
‘‘ఎంత గొప్పగా ఆడినా సరైన గుర్తింపు లేకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అయినా నువ్వేంటి.. అమోల్ మజూందార్ లాగే సర్ఫరాజ్ ఖాన్ ఎప్పటికీ టీమిండియాకు సెలక్ట్ కాడని అంటున్నావా? లేదంటే సెలక్ట్ కాకూడదని కోరుకుంటున్నావా? ఇదేం పద్ధతి? మీరేం మనిషి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి..
Ind Vs NZ: రాయ్‌పూర్‌లో రోహిత్ సేనకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment