ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు.
2024 సీజన్‌లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.
కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.
వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం.
ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment