బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ ఆగస్టు 7న తమ కుమారుడు రూబెల్ హత్యకు గురయ్యాడని రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి ఢాకాలోని అడబోర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. నిందితుల జాబితాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేరు కూడా ఉంది.
ఈ కేసులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు అందాయి. బాధితుల తరఫు లాయర్లు షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. షకీబ్‌పై కేసు విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ తెలిపాడు. ప్రస్తుతం షకీబ్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌పై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి దోహదపడ్డాడు.
కాగా, రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.
స్కోర్ వివరాలు..
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్)
Comments
Please login to add a commentAdd a comment