ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిపై కోపంతో విరుచుకుపడ్డాడు. అతడిని కొట్టినంత పని చేశాడు. ఇతర ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో కాస్త కూల్ అయ్యాడు. కానీ అతడి చేతిలో తిట్లు తిన్న ప్లేయర్ మాత్రం భయంతో బిక్కచచ్చిపోయాడు. అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌లో బంగాబంధు టీ20 కప్ పేరిట టోర్నీ నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మ్యాచ్‌ల తర్వాత టాప్ 5 జట్ల నుంచి నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బెక్సిమ్‌కో ఢాకా, ఫార్చూన్ బరిషల్ జట్ల మధ్య సోమవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది.
ఈ సందర్భంగా ఢాకా కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీంకు ఆ జట్టు ఆటగాడు నసూమ్ అహ్మద్ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్న వేళ.. బరిషల్ క్రికెటర్ అఫిఫ్ హుస్సేన్ బంతిని గాల్లోకి లేపాడు. దీనిని పట్టుకునేందుకు ముష్పికర్, అహ్మద్ పరుగెత్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఢీకొన్నారు. బంతి చేజారే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు బాల్‌ను క్యాచ్ చేసిన ముష్ఫికర్, అహ్మద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అతడి మీద చేయి చేసుకుంటాడా అన్నంతలా బెంబేలెత్తించాడు. (చదవండి: 5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్)
అయితే అహ్మద్ మాత్రం అతడిని కూల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి సారథికి సర్దిచెప్పారు. అహ్మద్ భుజం తట్టి ఊరడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘కూల్ రహీమ్.. అంతగా ఆవేశపడితే ఎలా.. ఇది జస్ట్ మ్యాచ్ అంతే ’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో ఢాకా జట్టు 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఈ క్యాచ్ మిస్ అయి ఉంటే కథ వేరేలా ఉండేది. అందుకే కెప్టెన్ అంతలా నారాజ్ అయ్యాడని ముష్పికర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢాకా జట్టు నిర్ణీత ఓవర్లలో 150 పరుగులు చేసింది. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నవేళ ముష్పికర్ 43, యాసిర్ అలీ 54 పరుగులతో రాణించడంతో ఢాకా జట్టు మంచి స్కోరు నమోదు చేయగలిగింది. ఇక చివరికంటా పోరాడిన బరిషల్ జట్టు 141 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment