West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా విజయం నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పరోక్షంగా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే పఠాన్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశాడంటూ అభిమానులు చర్చించుకున్నాడు. పనిలో పనిగా.. ఓవరాక్షన్ పాండ్యాకు మంచి కౌంటర్ ఇచ్చావంటూ ఇర్ఫాన్ పఠాన్‌ను ప్రశంసిస్తున్నారు.
పరాజయాల నుంచి తేరుకుని
విండీస్ పర్యటనలో భాగంగా హార్దిక్ సేనకు తొలి రెండు టీ20లలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ట్రినిడాడ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడిన టీమిండియా.. గయనా మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అదే వేదికపై జరిగిన కీలక మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్ గెలుపు ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాండ్యా బృందం 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. కరేబియన్లను 159 పరుగులకు కట్టడి చేసింది.
సూర్య, తిలక్ కష్టపడి..
అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా.. శుబ్‌మన్ గిల్(6) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(83) జట్టును ఆదుకునే బాధ్యతనెత్తికెత్తుకున్నాడు.
యువ సంచలనం తిలక్ వర్మ(49- నాటౌట్) అద్బుతంగా ఆడుతూ అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరు కలిసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి విజయానికి చేరువ చేయగా.. సూర్య అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(20- నాటౌట్) సిక్సర్ బాది లాంఛనం పూర్తి చేశాడు.
పాపం తిలక్ వర్మ..
అయితే, అప్పటికి తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నాడు. ఇంకా పదమూడు బంతులు మిగిలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సూర్యకు అండగా నిలిచి.. క్లిష్ట సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌కు హార్దిక్ స్టైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఈ హైదరాబాదీ స్టార్ కెరీర్ ఆరంభంలోనే వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన బ్యాటర్‌గా నిలిచేవాడు.
కానీ.. హార్దిక్ ఇలా మ్యాచ్ పూర్తి చేయడం అభిమానులతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వంటి వాళ్లకు కూడా రుచించలేదు. టీమిండియా అభిమానులైతే.. ‘‘ఇంత స్వార్థం పనికిరాదు. కోహ్లి విషయంలో ధోని ఏం చేశాడో గుర్తుందా?’’ అంటూ సోషల్ మీడియాలో పాండ్యాను ఏకిపారేస్తున్నారు.
మీరు కష్టపడండి.. నేను మాత్రం
ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘కష్టంగా ఉన్న పని మీరు చేయండి.. సులభంగా ఉన్న పని నేను చూసుకుంటా. ఇలాంటివి వినీ వినీ..’’ అంటూ తన వ్యాఖ్యలను అసంపూర్తిగా వదిలేశాడు. దీంతో.. ఇర్ఫాన్.. హార్దిక్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సిరీస్ ఆరంభం నుంచి కెప్టెన్‌గా ఓవరాక్షన్ చేస్తున్న పాండ్యా.. ఇప్పుడిలా స్వార్థంగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదంటూ చురకలు అంటిస్తున్నారు.
చదవండి: ఇంతలో ఎంత మార్పు.. ఐపీఎల్‌లో పులిలా, దేశానికి ఆడేప్పుడు పిల్లిలా..!
Mushkil kaam aap karo, Asaan kaam mein Kar leta hoo. Suna suna Sa lagta hai…
— Irfan Pathan (@IrfanPathan) August 9, 2023
Comments
Please login to add a commentAdd a comment