BGT 2023: కెరీర్‌లో వందో టెస్ట్ ఆడే ముందు టీమిండియా టెస్ట్ క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా తన మనసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌కు ముందు పుజారా చాలా విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు. 13 ఏళ్ల తన కెరీర్‌లో అనుభవాలను వివరిస్తూ వచ్చిన నయా వాల్.. తన అత్యుత్తమమైన ప్రదర్శనలు, ధీటైన ప్రత్యర్ధి, కఠినమైన బౌలర్, తన చిరకాల కోరిక.. ఇలా చాలా విషయాలను పంచుకున్నాడు.
టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడమే తన కల అని మనసులో మాటను బయటపెట్టిన పుజారా.. ధీటైన ముగ్గురు ప్రత్యర్ధుల్లో మొదటిది ఆసీస్, రెండో జట్టు ఇంగ్లండ్, మూడో టీమ్ న్యూజిలాండ్ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో జిమ్మీ ఆండర్సన్ పేరును తొలుత ప్రస్తావించిన పుజారా.. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, పాట్ కమిన్స్‌ల పేర్ల చెప్పాడు.
తన అత్యుత్తమ ప్రదర్శన గురించి పుజారా మాట్లాడుతూ.. అరంగేట్రంలో ఆసీస్‌పై చేసిన 72 పరుగులకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. ఆతర్వాత చెన్నైలో ఆసీస్‌పై చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్‌కు, ఆతర్వాత జొహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాపై చేసిన 123 పరుగుల ఇన్నింగ్స్‌కు, అలాగే గత ఆసీస్ పర్యటనలో గబ్బా టెస్ట్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లు అత్యుత్తమమైనవిగా చెప్పుకొచ్చాడు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ పుజారా కెరీర్‌లో వందో టెస్ట్ కానున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనత కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే దక్కింది. ఆసీస్‌తో రెండో టెస్ట్‌లో పక్కాగా తుది జట్టులో ఉండే పుజారా ఈ అరుదైన క్లబ్‌లో చేరే 13వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.
ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment