ప్రధాని నరేంద్ర మోదీ కితాబు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ఎలో రేటింగ్స్‌లో తెలంగాణ స్టార్ చెస్ ప్లేయర్, గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2800 పాయింట్ల మైలురాయిని అందుకోవడం అరుదైన ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న అర్జున్‌కు అభినందనలు. ఇది అసాధారణ ఘనత. మొక్కవోని పట్టుదల, నిలకడైన ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. జాతి గర్వపడే క్షణాలివి. వ్యక్తిగతంగానూ గొప్ప స్థాయికి చేరావు.
మరెంతో మంది యువత చెస్ ఆడేందుకు, ఈ క్రీడను ఎంచుకొని ప్రపంచ వేదికలపై రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇదేరకంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో మూడు రోజుల క్రితం అర్జున్ 2800 ఎలో రేటింగ్స్‌ను అందుకున్నాడు.
భారత్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా 16వ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ఆదివారం యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ముగిశాక అర్జున్ లైవ్ రేటింగ్ 2800 లోనికి వచ్చింది. ప్రస్తుతం అతని లైవ్ రేటింగ్ 2798కు చేరింది. యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అర్జున్ ప్రాతినిధ్యం వహించిన అల్కాలాయిడ్ క్లబ్ ఓపెన్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment