చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్‌ | Natarajan Says He Does Not Know How To Celebrate Aggressively | Sakshi
Sakshi News home page

నెట్‌ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్‌

Published Tue, Dec 8 2020 8:51 PM | Last Updated on Wed, Dec 9 2020 6:23 AM

Natarajan Says He Does Not Know How To Celebrate Aggressively - Sakshi

సిడ్నీ: ‘‘చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు. చిన్నప్పటి నుంచి నేనింతే. వికెట్‌ తీసిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో తెలీదు. అందుకే ఒక చిరునవ్వుతో సరిపెట్టేస్తాను. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఏదేమైనా.. ఈ ట్రిప్‌ నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. బలమైన ప్రత్యర్థి జట్టుపై నేను బాగా ఆడగలిగాను. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. నా ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నా. జట్టు సభ్యులందరూ నాకు అండగా నిలవడం వల్లే ఇది సాధ్యమైంది’’  అంటూ టీమిండియా బౌలర్‌ నటరాజన్‌ ఆసీస్‌ పర్యటన తాలూకు మధుర జ్ఞాపకాలు పంచుకున్నాడు. నెట్‌బౌలర్‌గా వచ్చిన తనకు వన్డే, టీ20ల్లో ఆడే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని, వరుణ్‌ చక్రవర్తి గాయం కారణంగా తనకు ఛాన్స్‌ దక్కిందని పేర్కొన్నాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగాని, ఈ టూర్‌ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించేది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.(చదవండి: టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు: మెక్‌గ్రాత్‌)

ఇక ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించడం వల్లే ఇక్కడిదాకా వచ్చానన్న ఈ తమిళనాడు పేసర్‌.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే ద్వారా అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్ ఆ మ్యాచ్‌లో రెండు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 3, 2 వికెట్లు, మంగళవారం నాటి ఆఖరి టీ20లో ఒక వికెట్‌ తీసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం నటరాజన్‌ మాట్లాడుతూ.. ‘‘నా బలాలేమిటో నాకు తెలుసు. నన్ను నేను నమ్ముకున్నా. పిచ్‌ స్వభావం గురించి వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌తో ముందుగానే చర్చించేవాడిని. అందుకు అనుగుణంగానే బౌలింగ్‌ చేశాను. డెత్‌ ఓవర్లలో కట్టర్స్‌, యార్కర్లు వేశాను. ఐపీఎల్‌లో ఏం చేశానో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాను. అనుకున్నది అనుకున్నట్లుగా ఆచరణలో పెట్టాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక చివరి టీ20లో కోహ్లి సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.(చదవండి: ఆకట్టుకున్న కోహ్లి.. పోరాడి ఓడిన టీమిండియా)

నువ్వే అర్హుడివి: పాండ్యా
కాగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నటరాజన్‌పై సహచరులు, క్రికెట్‌ దిగ్గజాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండర్‌, టీ20 మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ హార్దిక్‌ పాండ్యా తాజాగా మరోసారి ఈ పేసర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ట్విటర్‌లో అతడితో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేసిన పాండ్యా.. ‘‘నటరాజన్‌.. ఈ సిరీస్‌లో నీ ప్రదర్శన అత్యద్భుతం. కఠిన పరిస్థితుల్లో జట్టు తరఫున అరంగేట్రం చేసి ఇంత గొప్పగా రాణించడం నీ ప్రతిభ, కఠోర శ్రమకు నిదర్శనం. నాకు తెలిసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు నువ్వే అర్హుడివి భాయ్‌!’’  అని అభిమానం చాటుకున్నాడు.  

చదవండి: నటరాజన్‌ అరంగేట్రం.. అద్భుతమైన కథ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement