అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు ఒక రజత పతకం లభించింది. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రష్మీ రాథోడ్ 25 పాయింట్లు స్కోరు చేసి రజతం సాదించింది.
బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై నెగ్గింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–పుల్లెల గాయత్రి జోడీ 21–9, 21–16తో సిమ్రన్–రితిక జంటను ఓడించి తెలంగాణను గెలిపించింది. వియత్నాం ఓపెన్‌లో ఆడి శనివారం రాత్రి నేరుగా గుజరాత్ చేరుకున్న సిక్కి రెడ్డి ఆదివారం మధ్యాహ్నం సెమీఫైనల్లో ఆడటం విశేషం. నేడు ఫైనల్లో కేరళతో తెలంగాణ ఆడుతుంది. మహిళల 3్ఠ3 బాస్కెట్‌బాల్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.
రజతాలు నెగ్గిన పల్లవి, కార్తీక
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఆదివారం రెండు రజత పతకాలు చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్.పల్లవి రజతం సాధించింది. 18 ఏళ్ల పల్లవి మొత్తం 199 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో జి.కార్తీక రజతం సాధించింది. కార్తీక 12.85 మీటర్ల దూరం దూకింది. అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యెర్రాజీ ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment