Ned Vs Pak 3rd ODI: Pakistan Beat Netherlands By 9 Runs, Check Full Score Details - Sakshi
Sakshi News home page

Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్‌ మిస్‌! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం..

Published Mon, Aug 22 2022 10:10 AM | Last Updated on Mon, Aug 22 2022 10:40 AM

Ned Vs Pak 3rd ODI: Pakistan Beat Netherlands By 9 Runs Clean Sweep - Sakshi

ఆఖరి వన్డేలో పాక్‌ విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ (PC: Cricket Netherlands)

Pakistan tour of Netherlands, 2022 - ODI Series- 3rd ODI: నెదర్లాండ్స్‌ మరోసారి అద్భుత పోరాటం కనబరిచింది. నామమాత్రపు ఆఖరి వన్డేలో పర్యాటక పాకిస్తాన్‌ జట్టుకు చుక్కలు చూపించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో పరాజయం పాలైనప్పటికీ అభిమానుల మనసులు గెలుచుకుంది. కాగా రీషెడ్యూల్డ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో పాకిస్తాన్‌.. నెదర్లాండ్స్‌ పర్యటనకు వెళ్లింది.

ఈ క్రమంలో మొదటి వన్డేలో బాబర్‌ ఆజం బృందానికి గట్టి పోటీనిచ్చిన డచ్‌ జట్టు చివరి వరకు పోరాడి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, రెండో వన్డేలో మాత్రం టాపార్డర్‌ పూర్తిగా విఫలం కావడంతో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు.  

పూర్తి ఆత్మవిశ్వాసంతో..
ఇక సిరీస్‌ కోల్పోయినప్పటికీ.. ఆఖరిదైన మూడో వన్డేలోనూ నెదర్లాండ్స్‌ పట్టు సడలించలేదు. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో రోటర్‌డామ్‌ వేదికగా ఆదివారం(ఆగష్టు 21) జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది.

బాబర్‌ ఆజం కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(91)తో రాణించడంతో 49.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్‌ అయింది.  లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ అర్ధ శతకం(50)తో శుభారంభం అందించాడు. మిడిలార్డర్‌ కుప్పకూలినా క్రీజులో నిలబడి ఓపికగా పరుగులు రాబట్టాడు. 

టామ్‌ కూపర్‌ సైతం..
అదే విధంగా టామ్‌ కూపర్‌ 62 పరుగులతో రాణించాడు. ఇక తెలుగు మూలాలు గల తేజ నిడమనూరు 24 పరుగులు చేశాడు. మిగతావాళ్లంతా దాదాపుగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో 49.2 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌట్‌ అయిన నెదర్లాండ్స్‌ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ గెలుపుతో పాకిస్తాన్‌ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే, నెదర్లాండ్స్‌ మాత్రం మొదటి, ఆఖరి వన్డేలో పాక్‌కు ముచ్చెమటలు పట్టించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇక చివరి మ్యాచ్‌లో డచ్‌ జట్టు 9 పరుగులతో ఓడిపోగా.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం సైతం 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకోవడం గమనార్హం.

చదవండి: Ned Vs Pak 3rd ODI: ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టిన ఆర్యన్‌ దత్‌ ! బాబర్‌ ఆజం సెంచరీ మిస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement