మాటివ్వు: నీరజ్‌ చోప్రాతో మనూ భాకర్‌ తల్లి | Neeraj Chopra Meets Manu Bhaker And Her Mother, She Seeks Promise Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఒట్టేసి చెప్పు బాబూ: నీరజ్‌ చోప్రాతో మనూ భాకర్‌ తల్లి

Published Mon, Aug 12 2024 4:31 PM | Last Updated on Mon, Aug 12 2024 5:10 PM

Neeraj Chopra Meets Manu Bhaker And Her Mother She Seeks Promise Video

భారత అథ్లెట్లు మనూ భాకర్‌, నీరజ్‌ చోప్రాకు సంబంధించిన ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు పరస్పరం మాట్లాడుకుంటూ ఉండగా.. మనూ తల్లి ఫొటోలు తీశారు. అంతేకాదు.. ఆ తర్వాత నీరజ్‌ చోప్రా చేయి తన తలమీద పెట్టుకుని ఒట్టు వేయించుకున్నారు కూడా!

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో షూటర్‌ మనూ భాకర్‌ భారత్‌ పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో కంచు పతకం గెలిచిన 22 ఏళ్ల ఈ హర్యానా అమ్మాయి.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. తద్వారా భారత ఒలింపిక్స్‌ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత ప్లేయర్‌(స్వాతంత్ర్యం తర్వాత)గా అరుదైన రికార్డు సాధించింది.

అరుదైన ఘనత సాధించి
పందొమిదేళ్ల వయసులో టోక్యో ఒలింపిక్స్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని.. కఠిన సవాళ్లకు ఎదురీది ఈసారి రెండు మెడల్స్‌ గెలుచుకుంది మనూ. 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లోనూ నాలుగోస్థానంలో నిలిచి.. పతకానికి అడుగుదూరంలో నిలిచిపోయింది. మరోవైపు.. టోక్యో ఒలింపిక్స్‌ ‘గోల్డెన్‌ బాయ్‌’, భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా సైతం ప్యారిస్‌లో పతకం గెలిచాడు.

అయితే, ఈసారి రెండోస్థానంతో సరిపెట్టుకుని.. పసిడి కాకుండా రజత పతకానికి పరిమితమయ్యాడు. ఈ ఎడిషన్‌లో భారత్‌ తరఫున ఏకైక సిల్వర్‌ మెడల్‌ గెలిచిన అథ్లెట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మనూతో పాటు నీరజ్‌.. ఒలింపిక్స్‌-2024 ముగింపు వేడుకల్లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించాల్సింది. అయితే, ఆ ఛాన్స్‌ హాకీ లెజెండ్‌, కేరళ ప్లేయర్‌ శ్రీజేశ్‌కు దక్కింది. నీరజ్‌ చోప్రా మంచి మనసు వల్లే శ్రీజేశ్‌కు ఈ అవకాశం వచ్చింది.

మాటివ్వు బాబూ
ఇక ఆదివారం నాటి ముగింపు వేడుకల అనంతరం.. మనూ భాకర్‌- నీరజ్‌ చోప్రా సంభాషిస్తున్న వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో నీరజ్‌తో కలిసి ఫొటోకు ఫోజులివ్వాల్సిందిగా మనూ తల్లి సుమేధా భాకర్‌ కూతురిని కోరారు. అనంతరం.. నీరజ్‌ దగ్గరికి వచ్చిన సుమేధా.. నీరజ్‌ చేయి తన తల మీద పెట్టుకుని మాట తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

పసిడి పతకం తేవాలి!
వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన నీరజ్‌.. విజయ రహస్యం ఏమిటో తన కూతురికి కూడా చెప్పాలని కోరారని కొంతమంది అంటుండగా.. వచ్చేసారి కచ్చితంగా స్వర్ణం సాధించాలని 26 ఏళ్ల నీరజ్‌తో ఒట్టు వేయించుకున్నారని మరికొందరు అంటున్నారు. కాగా మనూ భాకర్‌, నీరజ్‌ చోప్రా.. ఈ ఇద్దరూ హర్యానాకు చెందిన వాళ్లే అన్న విషయం తెలిసిందే. 

నీరజ్‌ స్వస్థలం పానిపట్‌ కాగా.. మనూ భాకర్‌ కుటుంబానిది ఝజ్జార్‌ జిల్లాలోని గోరియా గ్రామం​. ఇదిలా ఉంటే.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. షూటింగ్‌లో మూడు కాంస్యాలు, హాకీ పురుషుల జట్టుకు కాంస్యం, రెజ్లింగ్‌లో ఒక​ కాంస్యం, జావెలిన్‌ త్రోలో ఒక రజతం దక్కాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement