Nepal Seeks Interpol Help Find Fugitive Cricket Star Sandeep Lamichhane - Sakshi
Sakshi News home page

Sandeep Lamichhane: స్టార్‌ క్రికెటర్‌ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

Published Tue, Sep 27 2022 3:58 PM | Last Updated on Tue, Sep 27 2022 4:26 PM

Nepal Seeks Interpol Help Find Fugitive Cricket Star Sandeep Lamichhane - Sakshi

నేపాల్‌ స్టార్‌ క్రికెటర్‌ సందీప్‌ లమిచ్చానేను ఆచూకీ కనుగొనడం కోసం నేపాల్‌ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. నేపాల్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్‌ లమిచ్చానేపై నేపాల్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. కాగా నేపాల్‌ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్‌ క్రికెట్‌ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది.

కాగా అప్పటికే సందీప్‌ లమిచ్చానే కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) ఆడేందుకు జమైకా వెళ్లాడు. కాగా సీపీఎల్‌లో జమైకా తలైవాస్‌కు ఆడుతున్న సందీప్‌ లమిచ్చానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్‌ పోలీసులు సందీప్‌ అరెస్ట్‌ విషయంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు.

అతని ఆచూకీ కోసం సభ్య దేశాల సహకారం కోరుతూ ఇంటర్‌పోల్ ఆదివారం అతనిపై "డిఫ్యూజన్" నోటీసు జారీ చేసిందని నేపాలీ పోలీసు ప్రతినిధి టెక్ ప్రసాద్ రాయ్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇంటర్‌పోల్‌ సహకారం వల్ల సందీప్‌ లమిచ్చానే అరెస్ట్‌ చేయగలమన్న నమ్మకం ఉంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని విచారిస్తే గానీ అసలు నిజం బయటపడదు. అని నేపాల్‌ పోలీసు ప్రతినిధి తెలిపాడు. అయితే లమిచ్చానే మాత్రం..'' తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి నాపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానంటూ'' ఆదివారం సోషల్‌ మీడియాలో పేర్కొనడం గమనార్హం. 

కాగా సందీప్‌ లమిచ్చానే నేపాల్‌ జట్టు తరపున స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. నేపాల్‌ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సందీప్‌ 30 వన్డేల్లో 69 వికెట్లె, 44 టి20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్‌ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. కాగా గతేడాది చివర్లో జరిగిన వేలంలో సందీప్‌ లమిచ్చానే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇంకో విషయమేంటంటే.. గతేడాది నేపాల్‌లో 2,300 రేప్‌ కేసులు నమోదైనట్లు నేపాల్‌ స్థానిక సంస్థ ఒకటి తన రిపోర్టులో పేర్కొంది.

చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు

జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. గింగిరాలు తిరుగుతూ గోల్‌ కొట్టిన దిగ్గజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement