రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (PC: BCCI)
Rohit Sharma Comments On Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. విరాట్‌ను దగ్గరగా గమనించే అవకాశం తనకు రావడం.. అతడితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ కోహ్లి బ్యాటింగ్ నైపుణ్యాల గురించి మాత్రమే మాట్లాడతారని.. అయితే, అందుకోసం మైదానం వెలుపల అతడు చేస్తున్న కృషి మరింత గొప్పగా ఉంటుందని రోహిత్ పేర్కొన్నాడు.
దేశం కోసం ఆడేందుకు కోహ్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని పునరుద్ఘాటించాడు. కేవలం వ్యక్తిగత, కుటుంబ కారణాల దృష్ట్యా మాత్రమే అతడు ఆటకు దూరంగా ఉంటాడే తప్ప.. ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన దాఖలాలు లేవని రోహిత్ కొనియాడాడు.
యువ ఆటగాళ్లకు ఆదర్శం
గాయాల కారణంగా కోహ్లి ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లలేదని.. అదీ అతడి ఫిట్‌నెస్ లెవల్స్‌కు నిదర్శమని ప్రశంసించాడు. యువ ఆటగాళ్లంతా కోహ్లిని ఈ విషయంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలని రోహిత్ టీమిండియా యంగ్‌స్టర్స్‌కు సూచించాడు.
ఈ మేరకు జియో సినిమా షోలో భాగంగా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో తొలుత కోహ్లి పేరు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆటకు అతడు దూరమయ్యాడు.
ఆ ఒక్క కారణంతోనే కాదు
ఈ నేపథ్యంలో.. టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ జియో సినిమా ఇంటర్వ్యూలలో భాగంగా రోహిత్ శర్మ చేసిన కోహ్లి గైర్హాజరీ గురించి మాట్లాడాడు. ‘‘కోహ్లి టీమిండియాకు ఆడేందుకు ఎల్లవేళలా సిద్ధంగానే ఉంటాడు.
గాయాల కారణంగా అతడు జట్టుకు దూరమైన పరిస్థితి ఎన్నడూ లేదు. ఎన్సీఏకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. అలాంటి వ్యక్తితో కలిసి ఆడటం నిజంగా నా అదృష్టమే. కోహ్లి బ్యాటింగ్ నైపుణ్యాలు అందరికీ తెలిసినవే. అతడు ఆడే కవర్ డ్రైవ్, ఫ్లిక్, కట్ షాట్ల గురించి యంగ్ క్రికెటర్లు మర్చిపోండి.
అయితే, అందుకోసం అతడు ఎంతగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్ లెవల్స్ మెయింటెన్ చేస్తున్న కారణంగా ఈరోజు తను ఏ స్థాయిలో ఉన్నాడో చూడండి’’ అని రోహిత్ శర్మ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
క్వాలిటీ బ్యాటర్ కోహ్లి
క్వాలిటీ బ్యాటర్‌గా కోహ్లి ఎదిగిన విధానం యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకమని కొనియాడాడు. కోహ్లి సాధించిన విజయాలతో ఇప్పటికే సంతృప్తి చెంది ఉండవచ్చని.. కానీ.. ఇంకా అరంగేట్ర ఆటగాడిలాగే ప్రతి మ్యాచ్‌లోనూ తనదైన ముద్ర వేయాలనే తపన కోహ్లిలో కనిపించడం అతడి అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టుతో కోహ్లి లేకుండానే బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్య రీతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో పరాజయం పాలై 0-1తో సిరీస్‌లో వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment