రెండో రోజు వెలుతురు, వర్షం పదే పదే ఆటను ఆపేశాయి. మూడో రోజు జెమీసన్ భారత ఇన్నింగ్స్‌ను అదే పనిగా కూల్చేశాడు. తొలి సెషన్‌లో పిచ్ పూర్తిగా పేస్‌వైపే మళ్లడంతో భారత బ్యాట్స్‌మెన్‌కు కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఆరంభంలోనే కెప్టెన్ కోహ్లి ఔటవ్వడం... ఇదే అదునుగా ఇంకెవరూ క్రీజులో పాతుకుపోయే అవకాశాన్ని కివీస్ పేసర్లు ఇవ్వనేలేదు. తర్వాత అనూహ్యంగా పిచ్ బ్యాటింగ్‌కు సహకరించడంతో న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ పరుగులు జత చేసింది. టెస్టుపై పట్టుబిగించేందుకు సిద్ధంగా ఉంది.
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ పేస్ పదునుకు భారత్ తడబడింది. కలిసొచ్చిన పిచ్‌పై న్యూజిలాండ్ సీమర్ కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ బదులివ్వలేకపోయింది. ఆదివారం తొలి సెషన్‌లోనే భారత్ పతనం అంచున నిలిచింది. చివరకు రెండో సెషన్ మొదలైన కాసేపటికే భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 49; 5 ఫోర్లు), కోహ్లి (196 బంతుల్లో 44; 1 ఫోర్) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది.
కోహ్లి పరుగు జత చేయకుండానే...
మూడో రోజు ఆట మొదలైందో లేదో గట్టిదెబ్బ తీశాడు జేమీసన్. ఓవర్‌నైట్ స్కోరుకే కెప్టెన్ కోహ్లి పెవిలియన్ చేరాడు. జేమీసన్ చక్కని లెంత్ బాల్‌తో భారత కెప్టెన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూకు వెళ్లాలా వద్దా అన్న సందేహంలో తటపటాయించిన కోహి ఆఖరి క్షణంలో రివ్యూ కోరాడు. కానీ ఫలితం దక్కలేదు. తర్వాత డాషింగ్ బ్యాట్స్‌మన్ పంత్‌ను జేమీసనే ఔట్ చేశాడు. దీంతో 156 పరుగుల వద్ద ఐదో వికెట్ కూలింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రహానే ఆట కూడా ఎంతోసేపు సాగలేదు. వాగ్నర్ బౌలింగ్‌లో రహానే స్క్వేర్ లెగ్‌లో లాథమ్ చేతికి చిక్కాడు.
పేసర్ల ప్రతాపం...
ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరగడంతో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అంటూ ఎవరూ మిగల్లేదు. బ్యాటింగ్ సామర్థ్యమున్న జడేజా (15), అశ్విన్ (22)ల ఆట స్కోరును 200 పరుగుల దాకా తీసుకొచ్చిందేగానీ... గట్టి భాగస్వామ్యానికి బాటలు వేయలేకపోయింది. సౌతీ తెలివైన బంతితో అశ్విన్‌ను పడేయగా... 211/7 స్కోరు వద్ద భారత్ లంచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత మరో 6 పరుగులు చేసి మిగిలున్న మూడు వికెట్లను కోల్పో యింది. ఇషాంత్ (4), బుమ్రా (0)లను జేమీసన్ ఔట్ చేయగా... జడేజాను బౌల్ట్ బోల్తా కొట్టించడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 71 పరుగుల తేడాతో భారత్ 7 వికెట్లను కోల్పోయింది.
శుభారంభం...
పిచ్ పరిస్థితిని గుర్తించిన కివీస్ ఓపెనర్లు లాథమ్, కాన్వే జాగ్రత్తగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు వందేసి బంతుల్ని ఎదుర్కొన్నారు. లాథమ్ (104 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను ఎట్టకేలకు అశ్విన్ పడేయడం కోహ్లి సేనకు కాస్త ఊరట నిచ్చింది. మరోవైపు ఓపెనర్ కాన్వే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు వంద దాటింది. మరికాసేపటికే ఇషాంత్... కాన్వేను ఔట్ చేయడంతో 101 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) సౌతీ (బి) జేమీసన్ 34; గిల్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 28; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 8; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) జేమీసన్ 44; రహానే (సి) లాథమ్ (బి) వాగ్నర్ 49; పంత్ (సి) లాథమ్ (బి) జేమీసన్ 4; జడేజా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 15; అశ్విన్ (సి) లాథమ్ (బి)సౌతీ 22; ఇషాంత్ (సి) రాస్ టేలర్ (బి) జేమీసన్ 4; బుమ్రా (ఎల్బీడబ్ల్యూ) (బి) జేమీసన్ 0; షమీ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (92.1 ఓవర్లలో ఆలౌట్) 217. వికెట్ల పతనం: 1–62, 2–63, 3–88, 4–149, 5–156, 6–182, 7–205, 8–213, 9–213, 10–217. బౌలింగ్: సౌతీ 22–6–64–1, బౌల్ట్ 21.1–4–47–2; జేమీసన్ 22–12–31–5, గ్రాండ్‌హోమ్ 12–6–32–0, వాగ్నర్ 15–5–40–2.
యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 30; కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్ 54; విలియమ్సన్ (బ్యాటింగ్) 12; రాస్ టేలర్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (49 ఓవర్లలో 2 వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–70, 2–101. బౌలింగ్: ఇషాంత్ శర్మ 12–4–19–1, జస్‌ప్రీత్ బుమ్రా 11–3–34–0; షమీ 11–4–19–0, అశ్విన్ 12–5–20–1, రవీంద్ర జడేజా 3–1–6–0.
Comments
Please login to add a commentAdd a comment