
మార్టిన్ గప్టిల్ (PC: ICC)
New Zealand Cricket- Martin Guptill: గతంలో.. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోం.. తాజాగా స్టార్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు. గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బుధవారం ప్రకటన చేసింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టుకు గప్టిల్ ఎంపికైనప్పటికీ ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
టీ20 ఫార్మాట్‌లో మెరుగైన రికార్డు ఉన్న గప్టిల్‌ను కాదని ఫిన్ అలెన్‌ను ఓపెనర్‌గా ఆడించింది యాజమాన్యం. ఇక ఈ టోర్నీలో కివీస్ సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గప్టిల్.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకునేందుకు సిద్ధమయ్యాడు.
చర్చించిన తర్వాతే
ఈ నేపథ్యంలో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ బోర్డు ఈ స్టార్ బ్యాటర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అనేక చర్చల అనంతరం గప్టిల్ అభ్యర్థన మేరకు అతడిని రిలీజ్ చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది.
గప్టిల్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నా.. జాతీయ జట్టు సెలక్షన్ సమయంలో అతడి పేరును పరిగణనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎన్‌జెడ్‌సీ స్పష్టం చేస్తోంది. దేశవాళీ క్రికెట్ జట్టు ఎంపిక సమయంలోనూ అతడికి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తన ప్రకటనలో పేర్కొంది.
ఇక ఈ విషయంపై స్పందించిన 36 ఏళ్ల గప్టిల్.. ‘‘దేశం తరఫున ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. బ్లాక్‌క్యాప్స్‌కు ఆడే సమయంలో నాకు సహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నా అవసరాల మేరకు ఇతర ఆప్షన్లు చూసుకోవాల్సి ఉంది. ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవాలి.
అద్భుత రికార్డులు
అలాగే కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికీ నేను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్ తరఫున టీ20లలో 122 మ్యాచ్‌లు ఆడి 3531 పరుగులు చేశాడు గప్టిల్. ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు.
గుడ్ బై చెప్పినట్లే!
అదే విధంగా 47 టెస్టుల్లో 2586, 198 వన్డేల్లో 7346 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 18 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్న ఈ స్టార్ బ్యాటర్.. టీ20లలో రెండె సెంచరీలు, 20 అర్ధ శతకాలు సాధించాడు. కాగా న్యూజిలాండ్ క్రికెట్ నిబంధనల ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా డొమెస్టిక్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకునే వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో గప్టిల్ అనధికారికంగా ఎన్‌జెడ్‌సీకి గుడ్‌బై చెప్పినట్లే!
చదవండి: Cristiano Ronaldo: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు
Hardik Pandya: వాళ్లిద్దరిని ఎందుకు ఆడించలేదు! ఇది నా జట్టు.. బయటి వాళ్ల మాటలు పట్టించుకోను!