దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ టాప్ లేపింది. ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టిన కివీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వార్షిక గణాంకాల ఆధారంగా న్యూజిలాండ్ టాప్‌కు చేరింది. 2018-19, 2019-20 సీజన్‌లలో ఐసీసీ సభ్య దేశాలు సాధించిన విజయాల్లో 50 శాతాన్ని పరిగణలోకి తీసుకోగా, 2020 మే నుంచి పూర్తిశాతాన్ని లెక్కించగా న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో టాప్‌కు చేరింది. అదే సమయంలో అప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగిన ఇంగ్లండ్ నాల్గో స్థానానికి పడిపోయింది. ఇక విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా మూడో స్థానానికి దిగజారింది.
ఈ క్రమంలోనే రెండో స్థానానికి ఆస్ట్రేలియా ఎగబాకగా, టీమిండియా మూడో స్థానానికి పరిమితమైంది. ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, 115 రేటింగ్ పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్ కూడా 115 రేటింగ్ పాయింట్లతో ఉన్నా డెసిమల్ పాయింట్లతో నాల్గో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ నాల్గో స్థానానికి పడిపోవడానికి భారత్, ఆస్ట్రేలియాలపై వన్డే సిరీస్‌లను చేజార్చుకోవడమే. అదే సమయంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌ను కోల్పోయింది. ఇవన్నీ ఇంగ్లండ్ వన్డే ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపాయి.
Comments
Please login to add a commentAdd a comment