
Neymar and Bruna Biancardi: బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్, పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్‌జీ) ప్లేయర్ నేమార్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘నీ రాక కోసం మేము కలగన్నాం.
ఎన్నెన్నో ప్రణాళికలు రచించాం. నీ రాక మా జీవితాలను పరిపూర్ణం చేయడంతో పాటు రానున్న రోజులను మరింత సంతోషకరంగా మారుస్తుందని మాకు తెలుసు. నువ్వొక అందమైన కుటుంబంలో అడుగుపెట్టబోతున్నావు.
తోబుట్టువులు, బామ్మ-తాతయ్యలు, అత్తమ్మలు, పిన్నమ్మలు ఇప్పటికే నీపై ఎంతో ప్రేమను పెంచుకున్నారు’’ అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంది. పుట్టబోయేది కూతురైనా, కొడుకైనా తమ ప్రేమలో ఎలాంటి తేడా ఉండదని.. తన గర్భంలో ఊపిరిపోసుకుంటున్న బిడ్డను తొందరగా చూడాలని ఉందంటూ ఉద్వేగానికి లోనైంది.
కాగా ఈ ఫొటోల్లో నేమార్ తన భాగస్వామి బ్రూనాను, పుట్టబోయే బిడ్డను ముద్దాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో నేమార్ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గతంలో నేమార్- డావీ లుకాతో కలిసి 2011లో కూతురికి జన్మనిచ్చాడు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఈ బ్రెజిలియన్ స్టార్‌కు రెండో సంతానం.
ఇదిలా ఉంటే.. 2021 నుంచి డేటింగ్ చేస్తున్న నేమార్- బ్రూనా 2022లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఏడు నెలల తర్వాత విడిపోతున్నట్లు మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, తాజాగా ఇలా తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు.
కాగా ఫిఫా వరల్డ్‌కప్-2022లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలన్న 30 ఏళ్ల నేమార్ కల ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కలగానే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment