టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. గంభీర్ స్వయంగా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడనే వార్తల నడుమ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఇతడేనంటూ కొత్త పేరు తెరమీదకు వచ్చింది.
టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీ20 ప్రపంచకప్-2024 దాకా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచకప్ గెలిచి తన బాధ్యతలకు ఘనంగా వీడ్కోలు పలికాడు ద్రవిడ్.
ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌ల పదవీకాలం కూడా ముగిసిన విషయం తెలిసిందే.
వీరి స్థానంలో గంభీర్ తనకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసుకుంటాడని, ఈ విషయంలో బీసీసీఐ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్(సౌతాఫ్రికా), అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్(కేకేఆర్‌లో గౌతీ సహచరుడు), బౌలింగ్ కోచ్‌గా వినయ్ కుమార్‌ను గౌతీ ఎంచుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే, తాజాగా ఇందుకు సంబంధించి మరో కొత్త వార్త వినిపిస్తోంది. వార్తా సంస్థ ANI అందించిన వివరాల ప్రకారం.. బౌలింగ్ కోచ్ విషయంలో బీసీసీఐ తమ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్‌కు బదులు మరో దిగ్గజ పేసర్, గంభీర్‌తో కలిసి ఆడిన జహీర్ ఖాన్ వైపు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన ఈ ముంబై బౌలర్ కోచ్ అయితే జట్టుకు ప్రయోజనకంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ జహీర్ ఖాన్ ఇందుకు సుముఖంగా లేకపోతే.. లక్ష్మీపతి బాలాజీ పేరును కూడా బోర్డు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వినయ్ కుమార్ విషయంలో మాత్రం కరాఖండిగా నో చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు ANIతో పేర్కొన్నాయి.
కాగా టీమిండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడిన జహీర్ ఖాన్.. ఆయా ఫార్మాట్లలో 311, 282, 17 వికెట్లు తీశాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ రికార్డు సాధించాడు.
ఇక చెన్నైకి చెదిన లక్ష్మీపతి బాలాజీ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 43 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టెస్టులాడి ఆయా ఫార్మాట్లలో 27, 34, 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎవరూ ఊహించని విధంగా బాలాజీ బౌలింగ్ కోచ్ రేసులోకి రావడం విశేషం. ఇక బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఈ ఊహాగానాలకు తెరపడదు.
Comments
Please login to add a commentAdd a comment