Hanuma Vihari Comments: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్‌మెంట్ నుంచి తనకు ఇప్పటి వరకు పిలుపు రాలేదని.. ప్రస్తుతం తాను జాతీయ జట్టులో చోటు గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నాడు.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఏ జట్టు కోసమైనా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీ మీదనే ఉందని.. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే మంచిదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌తో అరంగేట్రం
కాగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(111) కూడా ఉంది.
అదే ఆఖరు
ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే విహారి ఆఖరిసారిగా 2022లో ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలం(మొత్తం 31 రన్స్) కావడంతో మళ్లీ సెలక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టిన హనుమ విహారి తాజా రంజీ సీజన్‌లో తొలుత ఆంధ్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ వదులుకుని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఆరోజు ద్రవిడ్ అదే చెప్పాడు
ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి విహారి 365 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ గురించి ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘మేనేజ్‌మెంట్‌తో నేను కాంటాక్ట్‌లో లేను. నా ఆఖరి టెస్టు తర్వాత రాహుల్ ద్రవిడ్ ఒక్కడే నాతో మాట్లాడాడు.
నా ఆటలోని లోపాలను తెలియజేసి.. వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ఆ తర్వాత ఎవరూ టచ్‌లో లేరు. అయితే, ప్రస్తుతం దేని గురించి ఆలోచించకుండా.. బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడంపై మాత్రమే దృష్టి సారించాను.
నా దృష్టి మొత్తం బ్యాటింగ్ మీదే
ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా బెస్ట్ ఇచ్చి పరుగులు రాబట్టడమే పని. కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకునే దశలో లేను. ఏదేతే అది జరుగుతుంది. టెస్టు జట్టులో లేనందుకు నిరాశ, బాధ ఉన్న మాట వాస్తవమే.
అయినా ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఇప్పుడైతే రంజీలో వీలైనన్ని పరుగులు రాబట్టడమే పని’’ అని 30 ఏళ్ల హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో ఎలైట్ బి గ్రూపులో ఉన్న ఆంధ్ర జట్టు ప్రస్తుతం మూడు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: #Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా
Comments
Please login to add a commentAdd a comment