గన్ పేలింది... పురుషుల 100 మీటర్ల పరుగు ప్రారంభమైంది... ఎనిమిది మంది అసాధారణ అథ్లెట్లు దూసుకుపోయారు. 30 మీటర్లు ముగిసేసరికి థాంప్సన్ తొలి స్థానంలో, కెర్లీ రెండో స్థానంలో ఉండగా... అందరికంటే నెమ్మదిగా 0.178 సెకన్ల రియాక్షన్ టైమ్‌తో ఆలస్యంగా మొదలుపెట్టిన లైల్స్ చివరగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. 60 మీటర్లు ముగిసేసరికి థాంప్సన్, కెర్లీ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగగా... లైల్స్ మూడో స్థానానికి దూసుకుపోయాడు. కానీ తర్వాతి 40 సెకన్లలో కథ పూర్తిగా మారింది. లైల్స్ ఒక్కసారిగా అద్భుతాన్ని చూపించాడు. మెరుపు వేగంతో చిరుతలా చెలరేగిపోయి లక్ష్యం చేరాడు. 90 మీటర్ల వరకు కూడా ఏ దశలోనూ అగ్రస్థానంలో లేని లైల్స్ అసలైన ఆఖరి 10 మీటర్లలో అందరినీ వెనక్కి నెట్టేశాడు. ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్‌గా అవతరించాడు.
100 మీటర్ల స్ప్రింట్‌లో కొత్త విజేత
స్వర్ణం గెలుచుకున్న అమెరికన్ నోవా లైల్స్
జమైకా అథ్లెట్ థాంప్సన్‌కు రెండో స్థానం
ఇద్దరూ 9.79 సెకన్లలో రేసు పూర్తి
ఫోటో ఫినిష్‌తో తేలిన ఫలితం
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అథ్లెట్‌ను నిర్ణయించడం అంత సులువుగా జరగలేదు. నోవా లైల్స్ (అమెరికా), కిషాన్ థాంప్సన్ (జమైకా) ఇద్దరూ 9.79 సెకన్లలోనే రేసు పూర్తి చేశారు. దాంతో ‘ఫోటో ఫినిష్’ను ఆశ్రయించాల్సి వచి్చంది. చాలాసేపు ఉత్కంఠ నెలకొంది. తామిద్దరిలో ఎవరూ గెలిచామో కూడా తెలీని లైల్స్, థాంప్సన్ ఒకరి భుజంపై మరొకరు చేయి వేసి ఏం జరిగిందో ఎదురు చూస్తూ వచ్చారు. చివరకు ఇద్దరి మధ్య తేడా సెకనులో 5000వ వంతు మాత్రమే అని తేలింది. లైల్స్ టైమింగ్ 9.79 (.784) సెకన్లు కాగా, థాంప్సన్ టైమింగ్ 9.79 (.789)గా వచి్చంది. దాంతో 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు గెలిచిన అమెరికా అథ్లెట్‌గా లైల్స్ ఘనత సాధించగా... 98 మీటర్ల పాటు ఆధిక్యంలో ఉండి కూడా థాంప్సన్ రజతానికే పరిమితమయ్యాడు. ఫ్రెడ్ కెర్లీ (అమెరికా; 9.81 సెకన్లు) కాంస్య పతకం గెలుచుకున్నాడు.
పారిస్: అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్ పురుషుల 100 మీటర్ల పరుగు ఊహించినంత ఉత్కంఠను రేపి అదే స్థాయిలో ఆసక్తికర ఫలితాన్ని అందించింది. గత కొంత కాలంగా స్ప్రింట్స్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కూడా అయిన నోవా లైల్స్‌పై అంచనాలు పెరిగాయి. దానికి తగినట్లుగా అతను సిద్ధమయ్యాడు. తాజా రేసులో కూడా లైల్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. పరుగు పూర్తి చేసేందుకు లైల్స్‌కు 44 అంగలు పట్టగా, థాంప్సన్ 45 అంగలు తీసుకున్నాడు. చివరకు ఇదే తేడాను చూపించింది.
27 ఏళ్ల లైల్స్ తన కెరీర్ అత్యుత్తమ టైమింగ్‌తో ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో అత్యంత హోరాహోరీగా సాగిన 100 మీటర్ల పరుగు ఇది. ఫైనల్లో పాల్గొన్న ఎనిమిది మంది కూడా 10 సెకన్లలోపు పరుగు పూర్తి చేయడం ఇదే మొదటిసారి. విజేతకు, చివరి స్థానంలో నిలిచిన అథ్లెట్ టైమింగ్‌కు మధ్య అతి తక్కువ (0.12 సెకన్లు) తేడా మాత్రమే ఉండటం కూడా మరో విశేషం. ఈ రేసులో 4వ, 5వ, 6వ, 7వ, 8వ స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఆయా స్థానాల్లో కొత్త ప్రపంచ రికార్డు టైమింగ్స్‌ను నమోదు చేయడం మరో ఆసక్తికర అంశం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఇటలీ స్ప్రింటర్ మార్సెల్ జాకబ్స్ ఈసారి ఐదో స్థానంతో ముగించాడు.
అనామకుడేమీ కాదు!
100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచి ‘ఫాస్టెస్ట్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న నోవా లైల్స్ అనూహ్యంగా దూసుకు రాలేదు. గత కొంత కాలంగా అతను అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన అతను స్ప్రింట్స్‌లో మంచి విజయాలు సాధించాడు. వరుసగా మూడు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అతను పతకాలు గెలుచుకున్నాడు. 2019లో 200 మీ., 4్ఠ100 మీటర్ల రిలేలో 2 స్వర్ణాలు గెలుచుకున్న అతను 2022లో కూడా ఇవే ఈవెంట్లలో స్వర్ణం, రజతం సాధించాడు. అయితే 2023లో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్‌లో అతని కెరీర్‌లో హైలైట్ ప్రదర్శన వచి్చంది. ఈ ఈవెంట్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలేలలో స్వర్ణాలు సాధించిన అతను...
దిగ్గజం ఉసేన్ బోల్ట్ (2015) తర్వాత ఒకే ప్రపంచ చాంపియన్‌ప్‌లో ‘ట్రిపుల్’ సాధించిన తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ ప్రదర్శన వల్లే ఒలింపిక్స్‌లోనూ అతనిపై అంచనాలు పెరిగాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలవడంలో సఫలమైన లైల్స్... అంతకుముందు అమెరికా ఒలింపిక్ ట్రయల్స్‌లో విఫలం కావడంతో 100 మీటర్ల పరుగులో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్న అతను, 200 మీటర్ల పరుగులోనూ స్వర్ణంపై గురి పెట్టాడు.
‘ఫోటో ఫినిష్’ ఈ విధంగా...
రేస్ సమయంలో నిర్వాహకులు ‘స్లిట్ వీడియో సిస్టం’ను ఏర్పాటు చేసి దీనిని ఫినిషింగ్ లైన్‌కు అనుసంధానిస్తారు. అథ్లెట్లు లైన్‌ను దాటే సమయంలో ఈ వీడియో సిస్టం సెకనుకు 2000 చొప్పున అత్యంత స్పష్టమైన చిత్రాలు
(స్కానింగ్) తీస్తుంది. ఎవరైనా అథ్లెట్ అడ్డు వచ్చి మరో అథ్లెట్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉండే ప్రమాదం ఉండటంతో ట్రాక్‌కు రెండోవైపు కూడా అదనపు కెమెరాను ఏర్పాటు చేస్తారు. ఈ రేసు ముగింపు క్షణాన్ని చూస్తే లైల్స్‌కంటే ముందే థాంప్సన్ కాలు లైన్‌ను దాటినట్లుగా కనిపిస్తోంది. కానీ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య నిబంధనల ప్రకారం అథ్లెట్ కాలుకంటే అతని నడుము పైభాగం (ఛాతీ, పొత్తికడుపు, వీపు) ముందుగా లైన్‌ను దాటాలి. సరిగ్గా ఇక్కడే లైల్స్ పైచేయి సాధించాడు. ఫోటో ఫినిష్‌లో దీని కారణంగానే టైమింగ్ విషయంలో మరింత స్పష్టత వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment