ఐపీఎల్-2025 విజేత ఆర్సీబీతో డివిలియర్స్ (PC: BCCI)
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఒకడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్‌లలో ఆడిన ఘనత ఈ బ్యాటర్‌కు ఉంది.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఏబీడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ జట్టు మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ప్రస్తుత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లితోనూ డివిలియర్స్ బంధం విడదీయలేనిది. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఐదేసిసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్లతో ఏబీడీ మ్యాచ్‌లు ఆడాడు.
ఇది వివాదాస్పదం కావొచ్చు
టీ20 ఫార్మాట్లో అపార అనుభవం ఉన్న ఏబీ డివిలియర్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ఆల్‌టైమ్ టీ20 క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబు వైరల్‌గా మారింది. ‘‘ఇది వివాదాస్పదం కావొచ్చు.. కాదు కాదు.. వివాదానికి తావులేదు. ఇదొక చర్చనీయాంశమైన జవాబు కావొచ్చు.
ఎందుకంటే.. అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా అని నేను అనుకుంటున్నా. కానీ అతనెప్పుడూ నాకు బౌలింగ్ చేయలేదు. అయితే, నిలకడైన ఆటకు అతడు మారుపేరు. ముఖ్యంగా 20 ఓవర్ల ఆటలో ఏ సమయంలోనైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కొత్త బంతి లేదంటే పాత బంతితో అతడు అద్భుతాలు చేయగలడు.
గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా
సూపర్ ఓవర్ అయినా.. మరి ఇంకేదైనా బంతి అతడికి చేతికి ఇస్తే గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా అతడికి ఉంది. దటీజ్ జస్‌ప్రీత్ బుమ్రా’’ అని డివిలియర్స్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

పదిహేను పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు
కాగా టీ20 ప్రపంచకప్-2026లో బుమ్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా మరోసారి వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలవడంలో అతడి పాత్ర కీలకం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో బుమ్రా.. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదిహేను పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పద్నాలుగు వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై ప్రశంసల వర్షం కొనసాగుతుండగా.. డివిలియర్స్ సైతం ఈ మేరకు కొనియాడటం గమనార్హం.
సత్తా చాటుతున్న బుమ్రా
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీలో మరో భారత బౌలర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పద్నాలుగు వికెట్లు తీసి బుమ్రా సరసన నిలిచాడు.
కాగా బుమ్రా ఇప్పటికి 95 అంతర్జాతీయ టీ20లలో కలిపి 121 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి సత్తా చాటేందుకు బుమ్రా సిద్ధయ్యాడు.


