ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన ఈ చెన్నై స్టార్ 516 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. తద్వారా అనిల్ కుంబ్లే తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా అశూ కొనసాగుతున్నాడు.
ఇక అశ్విన్ తదుపరి సొంతగడ్డ వేదికగా బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్‌కు సరైన వారసుడు ఇతడేనంటూ టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మరో చెన్నై స్టార్‌కే ఉందని అభిప్రాయపడ్డాడు.
కుల్దీప్ కాదు!
ఇప్పటికే జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్ పేరును చెప్పాడు డీకే. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కొత్త తరం ఆఫ్ స్పిన్నర్ కోసం టీమిండియా వెదుకుతోంది. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఏ సిరీస్ సందర్భంగా మూడు మ్యాచ్‌లలో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లను బరిలోకి దించడమే ఇందుకు నిదర్శనం.
పుల్‌కిత్ నారంగ్, వాషింగ్టన్ సుందర్, సారాంశ్ జైన్‌లను ఈ సిరీస్ సందర్భంగా పరీక్షించింది. వీరిలో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం వాషింగ్టన్ సుందర్‌కే ఉంది. అశూ వారసుల పోటీలో అతడే ముందుంటానడంలో సందేహం లేదు. తనకు లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా వాషీ సద్వినియోగం చేసుకున్నాడు.
అతడే సరైన వాడు.. ఎందుకంటే?
అందుకే.. అశూ స్థానంలో అతడే సరైన వాడని చెప్పగలను’’ అంటూ దినేశ్ కార్తిక్ వాషీ పేరు చెప్పడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే విధంగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. 24 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 4 టెస్టులు, 22 వన్డేలు, 49 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 6, 23, 44 వికెట్లు తీశాడు. చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు వాషీ.
Comments
Please login to add a commentAdd a comment