'నా హృదయంలో ఈ టోర్నీకి ప్రత్యేక స్థానం ఉంది. నా వివాహ వార్షికోత్సవం రోజున నా శ్రీమతికి వింబుల్డన్ ట్రోఫీ రూపంలో కానుక ఇచ్చాను.'
–జొకోవిచ్
లండన్: పచ్చిక కోర్టులపై తనకు ఎదురులేదని నిరూపిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఏడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 4–6, 6–3, 6–4, 7–6 (7/3)తో అన్‌సీడెడ్, ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ కావడం విశేషం. 2018, 2019, 2021లలోనూ జొకోవిచ్ విజేతగా నిలిచాడు.
అంతకుముందు 2011, 2014, 2015లలో కూడా ఈ సెర్బియా స్టార్ చాంపియన్ అయ్యాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించలేదు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల బ్రిటిష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్ కిరియోస్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా జొకోవిచ్ కెరీర్‌లో ఇది 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. 35 ఏళ్ల జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను తొమ్మిదిసార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచాడు.
తొలి సెట్ కోల్పోయినా...
కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన కిరియోస్ తొలి సెట్‌లో జొకోవిచ్‌పై ఆధిక్యం ప్రదర్శించాడు. ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ముందంజ వేసిన కిరియోస్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే కెరీర్‌లో 32వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ తొలి సెట్ చేజార్చుకున్నా ఆందోళన చెందకుండా నెమ్మదిగా జోరు పెంచాడు.
కచ్చితమైన సర్వీస్‌లతోపాటు నెట్ వద్దకు దూసుకొస్తూ కిరియోస్‌ను ఒత్తిడికి గురి చేశాడు. నాలుగో గేమ్‌లో కిరియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో తొమ్మిదో గేమ్‌లో కిరియోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకొని జొకోవిచ్ సెట్‌ను గెలిచాడు. నాలుగో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను కోల్పోలేదు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించాడు.
కాగా నిక్ కిరియోస్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. సెమీస్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ పొత్తి కడుపు నొప్పితో మ్యాచ్ మధ్యలోనే వైదొలగొడంతో కిరియోస్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాడు.
🙏🏼❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/MWP4VRwvfg
— Novak Djokovic (@DjokerNole) July 10, 2022
😘#Wimbledon | #CentreCourt100 | @DjokerNole pic.twitter.com/Y6K5hPs58K
— Wimbledon (@Wimbledon) July 10, 2022
Magnificent.
In its 100 years, Centre Court has seen few champions like @DjokerNole#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/vffvL2f08Q
— Wimbledon (@Wimbledon) July 10, 2022
Comments
Please login to add a commentAdd a comment