న్యూఢిల్లీ: స్టేడియాల్లోకి ప్రేక్షకులను ఎప్పుడు అనుమతిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. బైచుంగ్ భూటియా ఫుట్‌బాల్ స్కూల్‌కు చెందిన అప్లికేషన్‌ను శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ఆయన కరోనా వ్యాప్తి ఉన్నంత కాలం ఈ విషయంపై స్పష్టతనివ్వలేమని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించే అంశంపై ఇప్పుడే మాట్లాడలేను. వీలైనంత తొందరగా ప్రేక్షకులతో స్టేడియాలు కళకళలాడాలని నేనూ కోరుకుంటున్నా. దానికన్నా ప్రజల ఆరోగ్య భద్రతే అందరికీ ప్రధానం. దీనికి స్థానిక అధికార యంత్రాంగాలు ఒప్పుకోవాలి.
వారి నిర్ణయానికే మేం కూడా కట్టుబడతాం. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో పరిస్థితి గురించి వారికే అవగాహన ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2028 ఒలింపిక్స్ నాటికి భారత్ పతకాల జాబితాలో టాప్–10లో ఉండాలన్న లక్ష్యంపై కొందరు విమర్శలు చేస్తున్నారని రిజుజు వెల్లడించారు. ‘టాప్–10లో ఎలా ఉంటామని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు పంచుకోవచ్చు. వారి మాటల్ని నేను పట్టించుకోను. మనం మన లక్ష్యంపైనే దృష్టి సారించాలి. వరల్డ్ చాంపియన్‌ను తయారు చేసేందుకు కనీసం 8 ఏళ్లు అవసరం. మేం అదే పనిలో ఉన్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment