బౌల్ట్ బౌలింగ్‌లో చితక్కొట్టిన ట్రవిస్ హెడ్ (PC: X/NZ/Prime)
న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు పునరాగమనంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత కివీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్లో.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ చితక్కొట్టాడు.
కాగా కివీస్ పర్యటనలో భాగంగా ఆసీస్ ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి అక్లాండ్ వేదికైంది. ఈడెన్ పార్క్ మైదానంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్ అటాక్ మొదలుపెట్టిన ట్రెంట్ బౌల్ట్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. మొదటి ఓవర్ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన హెడ్.. ఆ తర్వాత పరుగు తీయలేకపోయినా.. మరుసటి బంతికి సిక్సర్ బాదాడు.
అదే జోరును కొనసాగిస్తూ వరుసగా మరో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఇలా బౌల్ట్ బౌలింగ్లో ఒక్క ఓవర్లోనే 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌లో బౌల్ట్ ఏకంగా 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (22 బంతుల్లో 45), కెప్టెన్ మిచెల్ మార్ష్(26), ప్యాట్ కమిన్స్(28) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. ఆడం మిల్నే, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ తలా రెండు వికెట్లు తీశారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడే క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న బౌల్ట్ కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. 2022 నవంబరులో కివీస్ తరఫున ఆఖరి టీ20 ఆడిన బౌల్ట్.. 2023లో వన్డే ఆడాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా టిమ్ సౌతీ స్థానంలో జట్టులోకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment