NZ VS NED: చరిత్ర సృష్టించిన మిచెల్‌ సాంట్నర్‌.. ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌..! | NZ VS NED: Mitchell Santner Takes The First 5 Wicket Haul Of 2023 WC | Sakshi
Sakshi News home page

NZ VS NED: చరిత్ర సృష్టించిన మిచెల్‌ సాంట్నర్‌.. ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌..!

Published Tue, Oct 10 2023 7:31 AM | Last Updated on Wed, Oct 11 2023 8:30 PM

NZ VS NED: Mitchell Santner Takes The First 5 Wicket Haul Of 2023 WC - Sakshi

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ సాంట్నర్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన సాంట్నర్‌.. తొలుత బ్యాట్‌తోనూ రాణించి (17 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2  సిక్సర్లు) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 2 వికెట్లు పడగొట్టిన సాంట్నర్‌.. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా (7) కొనసాగుతున్నాడు. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌.. విల్‌ యంగ్‌ (70), రచిన్‌ రవీంద్ర (51), టామ్‌ లాథమ్‌ (53) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్‌, వాన్‌ డర్‌ మెర్వ్‌, వాన్‌ మీకెరెన్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదార్లండ్స్‌ ఆదిలోనే చేతులెత్తేసి 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ సాంట్నర్‌ (10-0-59-5), మ్యాట్‌ హెన్రీ (8.3-0-40-3), రచిన్‌ రవీంద్ర (10-0-46-1) నెదర్లాండ్స్‌ను కుప్పకూల్చారు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో కొలిన్‌ ఆకెర్‌మన్‌ (69) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తెలుగబ్బాయి తేజ నిడమనూరు 26 బంతుల్లో 21 పరుగులు చేసి రనౌటయ్యాడు. నెదర్లాండ్స్‌పై గెలుపుతో న్యూజిలాండ్‌ (1.958 రన్‌రేట్‌) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో తన హవాను కొనసాగిస్తుంది.

కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 10) మరో మ్యాచ్‌ జరుగనుంది. మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌ జట్లు తలపడతాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ధర్మశాలలో మరో మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ తలపడతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement