న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు.
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్‌దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్‌కల్లమ్ (123) పేరిట ఉండింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్‌మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్‌లో సాగింది.
ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్‌లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు.
మూడో మ్యాచ్‌లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment