దుబాయ్: ఎట్టకేలకు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు తీపి కబురు! టోర్నీ తొలి మ్యాచ్‌కంటే కేవలం 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టికెట్లను అమ్మకానికి ఉంచనుంది.
మ్యాచ్‌ల తేదీలనే బాగా ఆలస్యంగా (100 రోజుల ముందు) ప్రకటించిన ఐసీసీ ఇప్పుడు వేర్వేరు కారణాలతో వాటిని సవరించి బుధవారం తుది షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పాటు ఫ్యాన్స్ తమ ప్రణాళికలు రూపొందించుకునేందుకు వీలుగా టికెట్ల అమ్మకాల వివరాలను కూడా ఐసీసీ వెల్లడించింది.
‘భారత్ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్‌లు’... ‘భారత్ ఆడని ఇతర మ్యాచ్‌లు’ అంటూ రెండు రకాలుగా టికెట్ల అమ్మకాలను ఐసీసీ విభజించింది. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌ల టికెట్లను కూడా ఆరు వేర్వేరు దశల్లో (వేదికల ప్రకారం) అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. అయితే ఇతర ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌ల తరహాలో నేరుగా అమ్మకపు తేదీ నుంచి టికెట్లు కొనేందుకు అవకాశం ఉండదు.
వరల్డ్ కప్ టికెట్ల కోసం అభిమానులు ఆన్‌లైన్‌లో ముందుగా వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఆ తర్వాత కేటాయింపులు జరుగుతాయి. ఆగస్టు 15 నుంచి అభిమానులు https://www.cricketworldcup.com/register లో తమ వివరాలు నమోదు చేయాలి.
టికెట్ల అమ్మకపు తేదీల వివరాలు
25 ఆగస్టు నుంచి: భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లు/ప్రధాన మ్యాచ్‌లు
30 ఆగస్టు నుంచి: భారత్ ఆడే రెండు వామప్ మ్యాచ్‌లు (గువహటి, తిరువనంతపురం)
31 ఆగస్టు నుంచి: చెన్నై (ఆస్ట్రేలియాతో), ఢిల్లీ (అఫ్గానిస్తాన్‌తో), పుణే (బంగ్లాదేశ్‌తో)లలో భారత్ ఆడే మ్యాచ్‌లు
1 సెప్టెంబర్ నుంచి: ధర్మశాల (న్యూజిలాండ్‌తో), లక్నో (ఇంగ్లండ్‌తో), ముంబై (శ్రీలంకతో)లలో భారత్ మ్యాచ్‌లు
2 సెప్టెంబర్ నుంచి: బెంగళూరు (నెదర్లాండ్స్‌తో), కోల్‌కతా (దక్షిణాఫ్రికాతో)లలో భారత్ ఆడే మ్యాచ్‌లు
3 సెప్టెంబర్ నుంచి: అహ్మదాబాద్‌లో (పాకిస్తాన్‌తో) భారత్ ఆడే మ్యాచ్
15 సెప్టెంబర్ నుంచి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment