భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అప్పీలుపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(CAS) మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ హర్యానా అథ్లెట్‌కు రజతం ఇవ్వాలా? లేదా అన్న అంశంపై మరికొన్ని గంటల్లో తమ నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ నేపథ్యలో వినేశ్ ఫొగట్ తరఫున CASలో వాదనలు వినిపించిన న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్ సింఘానియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చారిత్రాత్మక తీర్పు ఆశిస్తున్నాం
‘‘వినేశ్ పతకం వస్తుందనే అందరం ఆశిస్తున్నాం. సీఏఎస్(CAS) అడ్ హక్ ప్యానెల్.. అప్పీలు నమోదైన 24 గంటల్లోనే తీర్పునిస్తుంది. అయితే, వినేశ్ విషయంలో రోజుల తరబడి వాయిదా వేశారు కాబట్టి వారు ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారని అర్థమవుతోంది. ఒకవేళ ఆర్బిట్రేటర్ ఎంత ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తే.. మనకు అంత మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది.
గతంలో సీఏఎస్(CAS)లో నేను కేసులు వాదించాను. నిజానికి ఇక్కడ సక్సెస్ రేటు తక్కువే. అయితే, చరిత్రలో గుర్తుండిపోయే తీర్పు కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నాం. అందరికీ చిరస్మరణీయంగా మిగిలే తీర్పు ఇవ్వాలని ఆర్బిట్రేటర్‌ను కోరాం. ఇది కాస్త కష్టమే. అయితే, అంతా మంచే జరుగుతుందని మనం ఆశిద్దాం.
వినేశ్ కోసం మనమంతా ప్రార్థిద్దాం. తనకు పతకం వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. ఒకవేళ పతకం రాకపోయినా.. తనెప్పటికీ చాంపియనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని విదుష్పత్ సింఘానియా ఇండియా టుడేతో వ్యాఖ్యానించారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో వినేశ్ ఫొగట్ అద్భుత విజయాలతో మహిళల 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది వినేశ్.
అనూహ్య రీతిలో అనర్హత వేటు
అయితే, అనూహ్య రీతిలో స్వర్ణ పతక బౌట్‌కు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు తేలడంతో పోటీలో పాల్గొనకుండా ఆమెపై వేటు పడింది. దీంతో ఫైనల్‌కు వినేశ్ దూరమైంది. ఈ నేపథ్యంలో తనను పోటీకి అనుమతించాలని, లేనిపక్షంలో సంయుక్త రజత పతకం ఇవ్వాలని సీఏఎస్(CAS)కు అప్పీలు చేసింది.
ఈ నేపథ్యంలో ఫైనల్‌కు అనుమతించలేమని ముందే స్పష్టం చేసిన స్పోర్ట్స్ కోర్టు.. రజత పతకం ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై ఆగష్టు 10నే తీర్పు ఇస్తామని చెప్పిన కోర్టు.. తదుపరి ఆగష్టు 13కు వాయిదా వేసింది.
చదవండి: రూ. 1.5 కోట్లా? ఎవరిచ్చారు?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment