సచిన్‌, యువరాజ్‌ మెరుపులు.. సిక్సర్‌తో గెలిపించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ | One World One Family Cricket Cup 2024: One World Beat One Family By 4 Wickets, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

సచిన్‌, యువరాజ్‌ మెరుపులు.. సిక్సర్‌తో గెలిపించిన ఇర్ఫాన్‌ పఠాన్‌

Published Thu, Jan 18 2024 2:42 PM | Last Updated on Fri, Jan 19 2024 9:25 AM

One World One Family Cricket Cup: One World Beat One Family By 4 Wickets - Sakshi

సచిన్‌ టెండూల్కర్‌తో పాటు భారత్‌, ఇతర దేశాలకు చెందిన క్రికెట్‌ దిగ్గజాలు మరోసారి బరిలోకి దిగారు. మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 'వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ' కప్‌లో వీరంతా రెండు టీమ్‌లుగా విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడారు. ఈ మ్యాచ్‌ ద్వారా సేకరించబడే డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్‌ వారు నిరుపేదల కోసం వినియోగిస్తారు.

ఐక్యత యొక్క శక్తిని, మానవత్వం యొక్క బలాన్ని, సామాజిక బాధ్యత యొక్క భావాన్ని వెదజల్లడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్‌ కెప్టెన్సీలోని వన్‌ వరల్డ్‌, యువరాజ్‌ సింగ్‌ నాయకత్వంలోని వన్‌ ఫ్యామిలీ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన వన్‌ ఫ్యామిలీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ ఆటగాడు డారెన్‌ మ్యాడీ (51) అర్ధసెంచరీతో రాణించగా.. లంక మాజీ వికెట్‌కీపర్‌ కలువితరణ 22, టీమిండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్‌ పఠాన్‌ 38, యువరాజ్‌ సింగ్‌ 23 పరుగులు చేశారు. వన్‌ వరల్డ్‌ బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. సచిన్‌, ఆర్పీ సింగ్‌, అశోక్‌ దిండా, మాంటీ పనేసర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అన్న బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి గెలిపించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ 
181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్‌ వరల్డ్‌.. అల్విరో పీటర్సన్‌ (74), సచిన్‌ టెండూల్కర్‌ (27), నమన్‌ ఓఝా (25), ఉపుల్‌ తరంగ (29) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. యూసఫ్‌ పఠాన్‌ బౌలింగ్‌లో అతని సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించాడు.

వన్‌ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ముత్తయ్య మురళీథరన్‌, యువరాజ్‌ సింగ్‌, జేసన్‌ క్రేజా తలో వికెట్‌ దక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత క్రికెట్‌ దిగ్గజాలు బరిలోకి దిగడ​ం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement