
టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆటగాళ్లంతా ఉద్వేగానికి గురవడం అన్నింటా కనిపిస్తోంది. భారత జట్టు కోణంలో చూస్తే ప్రతీ రోజు తమ ఆటను మెరుగుపర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన పర్యవేక్షణ కారణంగా కొన్నాళ్లుగా మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఇంత మంది ఆటగాళ్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం గతంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి వారిపై అంచనాలు కూడా పెరిగాయి. సన్నాహాలు కూడా బాగున్నాయి కాబట్టి చరిత్ర సృష్టించే అవకాశం భారత్‌కు ఉంది.
15–20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే మనం ఈ రోజు స్పందించినంత చురుగ్గా అప్పుడు చేయలేకపోయేవాళ్లమేమో! ముఖ్యంగా కొన్ని క్రీడాంశాలకు కేటాయించిన వనరులు చూస్తే మన జట్ల సన్నద్ధత చాలా బాగుంది. షూటింగ్ విషయానికొస్తే... నాకు తెలిసి షూటింగ్ జట్టుకు లభించినంత ఆర్థికపరమైన సహకారం, మరే ఇతర క్రీడా జట్లకు దక్కలేదు.
గతంలోనే చెప్పినట్లు ఒలింపిక్స్ అంటే క్రీడా పోటీలు మాత్రమే కాదు. అత్యున్నత విలువలు, స్నేహం, ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం అని మరచిపోవద్దు. ఒక పతకం కోసం పోటీ పడుతున్నామంటే అది మన కోసం కాదు మొత్తం దేశానికి, ఒలింపిక్ స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని భావించాలి. క్రీడలకు ఉన్న గొప్పతనం అది. ఆటల్లో ఎలా గెలవాలనే కాదు, ఓటమిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా నేర్చుకుంటాం.
భారత జట్టు విషయానికి వస్తే 2016 రియో ఒలిం పిక్స్‌లో వైఫల్యం తర్వాత ఏర్పాటు చేసిన ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ కారణంగా మన బృందం ఈసారి బాగా సిద్ధమైందని తెలిసింది. అయితే నా దృష్టిలో ఆటగాళ్లదే ఈ ఘనత. అనేక దిద్దుబాట్ల తర్వాత మన వ్యవస్థ ఎంతో మెరుగైందనేది వాస్తవం. క్రీడల్లో నిన్నటికంటే నేడు ఇంకా ఆట బాగుండేందుకు శ్రమించడం సహజం. గత కొన్నేళ్లలో ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు మున్ముందు మరిన్ని మంచి ఫలితాలు అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment