12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకున్న తమిళనాడు ప్లేయర్
India's 85th chess Grandmaster- దుబాయ్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్‌భారత చెస్‌లో 85వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు.
జీఎం హోదా దక్కాలంటే చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్‌ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది.
12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్ నిఖిల్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్‌లో నిలిచాడు.
చాలా సంతోషంగా ఉంది
ఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్‌మాస్టర్లతో తలపడిన శ్యామ్ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాను.
2012లోనే రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment