పిచ్చి పట్టిందా? కుల్దీప్‌ ఆగ్రహం.. పంత్‌ రియాక్షన్‌ ఇదే | Sakshi
Sakshi News home page

#Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్‌ ఆగ్రహం.. పంత్‌ రియాక్షన్‌ ఇదే

Published Thu, Apr 18 2024 9:43 AM

Pagal Vagal Hai Kya: Kuldeep Lashes Out at DC Teammate Pant Reacts - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మదాబాద్‌లో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు. ఆది నుంచే గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. ఢిల్లీ వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ శుబ్‌మన్‌ గిల్‌ వికెట్‌ తీసి టైటాన్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని మొదలుపెట్టగా.. ముకేశ్‌ కుమార్‌ వృద్ధిమాన్‌ సాహా వికెట్‌ పడగొట్టాడు.

ఇక సుమిత్‌ కుమార్‌ అద్భుత రీతిలో సాయి సుదర్శన్‌(12)ను రనౌట్‌ చేయగా.. ఇషాంత్‌ మరోసారి మ్యాజిక్‌ చేసి డేవిడ్‌ మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ అభినవ్‌ మనోహర్‌, షారుఖ్‌ ఖాన్‌ వికెట్లు తీసి టైటాన్స్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.

రషీద్‌ అవుట్‌ కావడంతో..
తానేమీ తక్కువ కాదన్నట్లు అక్షర్‌ పటేల్‌ రాహుల్‌ తెవాటియా(10) రూపంలో కీలక వికెట్‌ దక్కించుకోగా.. ఖలీల్‌ అహ్మద్‌ మోహిత్‌ శర్మను అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ గాడిన పడేసే ప్రయత్నం చేసిన రషీద్‌ ఖాన్‌(31)ను పెవిలియన్‌కు పంపిన ముకేశ్‌ కుమార్‌ .. నూర్‌ అహ్మద్‌ వికెట్‌ కూడా తీసి కథ ముగించాడు. 

ఫలితంగా సొంతమైదానంలో 89 పరుగులకే కుప్పకూలింది గుజరాత్‌ టైటాన్స్‌. ఇక లక్ష్య ఛేదనలో ధనాధన్‌ ధోరణి అవలంభించిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లాంఛనం పూర్తి చేసింది. 

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన ఢిల్లీ పొరపాట్లకు తావు లేకుండా గెలిచిన తీరు.. అందులోనూ ముఖ్యంగా కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ రాణించడం అభిమానులను ఖుషీ చేసింది. అదే విధంగా అతడు ఈ మ్యాచ్‌లో కూల్‌గా డీల్‌ చేసిన విధానం కూడా ముచ్చటగొలిపింది.

పిచ్చి పట్టిందా అంటూ కుల్దీప్‌ ఆగ్రహం
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ప్రధాన స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్‌ బౌల్‌ చేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రాహుల్‌ తెవాటియా షాట్‌ ఆడబోయి విఫలమయ్యాడు.

కానీ, అప్పటికే మరో ఎండ్‌లో ఉన్న అభినవ్‌ మనోహర్‌ తెవాటియా పరుగు తీస్తాడేమోనని క్రీజు వీడాడు. ఇంతలో బంతిని అందుకున్న ఫీల్డర్‌ ముకేశ్‌ కుమార్‌ను వికెట్లకు గిరాటేయాల్సిందిగా పంత్‌ ఆదేశించాడు.

ముకేశ్‌ కూడా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌వైపు గురిపెట్టాడు. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన తెవాటియా మనోహర్‌ను వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించగా.. అతడు సరైన సమయంలో క్రీజులో చేరాడు. 

మరోవైపు.. ముకేశ్‌ విసిరిన బంతి ఓవర్‌ త్రో అయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుల్దీప్‌ యాదవ్‌.. ముకేశ్‌ కుమార్‌ను ‘నీకేమైనా పిచ్చి పట్టిందా’ అంటూ ఫైర్‌ అయ్యాడు. ఇంతలో పంత్‌ జోక్యం చేసుకుని ‘కోపం వద్దు భయ్యా’ అంటూ కుల్దీప్‌ను హత్తుకుని మరీ సముదాయించాడు. ఇంతలో ముకేశ్‌ సైతం చిరునవ్వులు చిందిస్తూ కుల్దీప్‌ కోపాన్ని లైట్‌ తీసుకున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

చదవండి: Shubman Gill: ఒక్కరైనా డబుల్‌ హ్యాట్రిక్‌ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే!

Advertisement

తప్పక చదవండి

Advertisement