పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది అరుదైన ఫీట్ సాధించాడు. టి20ల్లో 50 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా అఫ్రిది రికార్డు సృష్టించాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 గ్రూప్-2లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. ప్రొటీస్‌తో మ్యాచ్‌లో అఫ్రిది మంచి ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసిన షాహిన్ 14 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్‌ను డకౌట్‌గా పెవిలియన్ పంపిన అఫ్రిది తన రెండో ఓవర్‌లో రొసౌ వికెట్ తీసి పాక్‌కు బ్రేక్ ఇచ్చాడు.
ఇక వర్షం అంతరాయం అనంతరం మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షాహిన్ ఈసారి విధ్వంసకర హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసి మూడో వికెట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే టి20ల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న అఫ్రిది 22 ఏళ్ల 211 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మహిళా పేసర్ ఎలిస్సీ పెర్రీ(23 ఏళ్లు)ని అఫ్రిది అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుల క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. రషీద్ ఖాన్(అఫ్గానిస్తాన్), స్టెఫానీ టేలర్(వెస్టిండీస్), దీప్తి శర్మ(టీమిండియా) తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో గెలుపొందిన పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారీ వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించి దక్షిణాఫ్రికాకు 142 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులకు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment