
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బ్రూక్ చేసిన ఈ ట్రిపుల్ సెంచరీ రెండో వేగవంతమైనది.
బ్రూక్ తన ట్రిపుల్‌ను 310 బంతుల్లో పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 278 బంతుల్లోనే ట్రిపుల్ కంప్లీట్ చేశాడు.
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్స్
- సెహ్వాగ్- 278 బంతులు
- బ్రూక్- 310 బంతులు
- మాథ్యూ హేడెన్- 362 బంతులు
- సెహ్వాగ్- 364 బంతులు
కాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. జో రూట్ భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రూట్ 375 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో 262 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో పాటు జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద (7 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.
చదవండి: ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment