క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్ వేసిన ఘనతను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ దేశవాలీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా పెషావర్ వేదికగా కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ అతిపెద్ద నోబాల్ వేశాడు.
క్రీజు లైన్ దాటిన అసద్ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్ రెండు నోబాల్స్, రెండు వైడ్స్ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
అయితే చాలా మంది అసద్ అక్తర్ వేసిన నోబాల్‌ను 2010లో ఇంగ్లండ్‌పై పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన నోబాల్‌తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్ ఫిక్సింగ్‌లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్ సహా అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్ అక్తర్ వేసిన నోబాల్‌తో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది.
A 25 year old Pakistani pacer, Asad Akhtar, bowled a shocking no ball in their ongoing premium domestic T20 tournament and it looked ridiculously suspicious. Spot fixing again. pic.twitter.com/zFRzScLFLx
— Kakarot (@MidOffMind) March 15, 2026
ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు.
"లండన్‌లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్‌టైమ్‌గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్‌ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్‌ను బాగు చేసిన తర్వాత అందులో మజార్‌కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్‌లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.


