పాక్ ఆరోపణలు సరైనవి కావు
కరాచీ: ఇటీవల ముగిసిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డుప్లెసిస్‌కు శిక్ష విధించడంలో అలసత్వం చూపారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. క్రికెటర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తీసుకున్న చర్యను ఐసీసీ సమర్థించుకుందని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ట్యాంపరింగ్‌కు సంబంధించి సవరించిన నిబంధనలను సాకుగా చూపెడుతోందని విమర్శించారు.
‘ఈ మొత్తం ఉదంతంలో బూన్... డుప్లెసిస్పై దయ చూపారు. 2010లో పెర్త్ వన్డేలో ఆఫ్రిది ట్యాంపరింగ్‌కు పాల్పడితే రెండు టి20 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అప్పటి సంఘటన, ఇప్పటిది రెండు ఒకేలా ఉన్నప్పుడు శిక్షలో మాత్రం తేడా ఎందుకు అని మేం ప్రశ్నిస్తున్నాం. రెండో టెస్టులో మరికొంత మంది ప్రొటీస్ ఆటగాళ్లూ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై ఐసీసీ స్పందించిన తీరూ ఏమాత్రం బాగాలేదు. మ్యాచ్ రిఫరీ తీర్పును సమర్థించడమే పనిగా పెట్టుకుంది’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రతి ఒక్కరూ చేస్తారు: ముస్తాక్ మహ్మద్
కరాచీ: ప్రతి జట్టు, ప్రతి బౌలర్ ఏదో ఓ సమయంలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడతారని పాక్ మాజీ కెప్టెన్, కోచ్ ముస్తాక్ మహ్మద్ అన్నారు. దీని గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘బంతిపై మంచి గ్రిప్ లభించేందుకు స్పిన్నర్లు కూడా సీమ్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు నేను కూడా అలా చేశా. ఇది కూడా ఓ రకమైన ట్యాంపరింగే. ఏ జట్టయినా ఇలా చేయడం సర్వసాధారణం. అయితే ట్యాంపరింగ్ చేసిన ప్రతిసారి వికెట్లు పడతాయనుకోవడం పొరపాటు. రివర్స్ స్వింగ్ నైపుణ్యం ఉంటే బౌలర్లకు బాగుంటుంది’ అని ముస్తాక్ వివరించారు.