పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం అంపశయ్య మీద ఉందని.. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు ప్రస్తుతం అత్యవసరమని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. బాబర్ ఆజం కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. బాబర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని.. అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా పాక్ జట్టు తీవ్రంగా నిరాశపరుస్తోంది.
వరుస పరాభవాలు
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో ఓడిపోవడమే గాకుండా.. సూపర్-8కు కూడా చేరకుండానే ఇంటిబాటపట్టింది.
ఐసీయూలో ఉంది
ఇక ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలిసారిగా టెస్టుల్లో ఓడిపోవమే గాక.. 0-2తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఫలితంగా పాక్ జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. పరిస్థితిని చక్కదిద్దగల ప్రొఫెషనల్ డాక్టర్ కావాలి. ఆర్థికంగానూ బోర్డు బలపడాల్సిన ఆవశ్యకత ఉంది.
సమస్యల సుడిగుండంలో పాక్ జట్టు
సరైన కోచ్‌లు కూడా ముఖ్యమే. పాక్ జట్టు సమస్యల సుడిగండంలో కూరుకుపోయింది. మైదానం లోపల.. వెలుపలా పరిస్థితి ఒకేలా ఉంది’’ అని పేర్కొన్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోవడమే ఉత్తమమన్న రషీద్ లతీఫ్.. బ్యాటర్‌గా జట్టుకు అతడి అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా పాకిస్తాన్ తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడనుంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌కు బాబర్, టెస్టులకు షాన్ మసూద్ ప్రస్తుతం సారథులుగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment