PC: Hockey India
పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనబోయే భారత పురుషుల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. విశ్వ క్రీడల్లో ఆడబోయే 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించారు.
కెప్టెన్‌గా అతడే
డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్‌ను అతడికి డిప్యూటీగా ఎంపిక చేశారు. ఇక ఈ జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది.
కాగా 2016లో మొదటిసారిగా ఒలింపిక్స్(రియో) జట్టులో చోటు దక్కించుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్.. 2020 టోక్యో క్రీడల జట్టులోనూ భాగమయ్యాడు. అదే విధంగా.. వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఇవి నాలుగో ఒలింపిక్స్.
భారత హాకీ జట్టు డిఫెన్స్ విభాగం హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్‌లతో పటిష్టంగా ఉంది. ఇక మిడ్ ఫీల్డర్లుగా రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ సత్తా చాటుతున్నారు.
అదే విధంగా ఫార్వర్డ్ లైన్‌లో అభిషేక్ , సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్‌దీప్ సింగ్, గుజ్రాంత్ సింగ్ తదితరులు ఉండనే ఉన్నారు.
ఇక వీరితో పాటు అదనపు ఆటగాళ్లుగా గోల్‌కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్, మిడ్ ఫీల్డర్ నీలకంఠ శర్మ, డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ అందుబాటులో ఉండనున్నారు. కాగా తమ జట్టు అనుభవజ్ఞులైన, యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో సమతూకంగా ఉందని చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ పేర్కొన్నాడు. ఇక జూలై 29 నుంచి ఒలింపిక్ క్రీడలు ఆరంభం కానున్నాయి.
పారిస్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల హాకీ జట్టు
గోల్ కీపర్: శ్రీజేష్ పరాట్టు రవీంద్రన్
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్
మిడ్ ఫీల్డర్లు: రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్
ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్‌దీప్ సింగ్, గుర్జాంత్ సింగ్
ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: నీలకంఠ శర్మ, జుగ్రాజ్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్.
తొలిసారి ఒలింపిక్స్ హాకీ జట్టులో చోటు దక్కించుకున్నది వీళ్లే
జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment