
మాల్దీవ్స్: టీ20 ప్రపంచకప్ భారత్‌లో ఆడకపోవడమే మంచిదని ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 14వ సీజన్ రద్దు కావడంతో ఆసీస్ ఆటగాళ్లు నేరుగా దేశానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కమిన్స్ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''భారత్‌లో కరోనా విజృంభిస్తున్నవేళ టీ20 ప్రపంచకప్ నిర్వహించడం మంచి ది కాదు. ఇప్పటి పరిస్థితుల్లో అది ఎంత మాత్రం సురక్షితం కాదు. టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించడమే మంచిదని నా అభిప్రాయం. అయితే ఆ మెగా ఈవెంట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉండంతో ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. భారతీయులకు ఏది మంచిదనే విషయంపై క్రికెట్ వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరపడం ముఖ్యం. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. అక్కడ బాగా నిర్వహించారు. కానీ చాలా మంది దాన్ని భారత్‌లోనే నిర్వహించాలని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అందరి అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది'' అని అభిప్రాయపడ్డాడు.
కాగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కమిన్స్ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శననే నమోదు చేశాడు. ముఖ్యంగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ తన బ్యాటింగ్‌తో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్ధేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా, ఏమాత్రం వెరవకుండా ఎదురుదాడికి దిగి ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించింది. కమిన్స్(34 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అద్వితీయ పోరాటం క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇక కేకేఆర్ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 ఓటములు.. 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్!
Comments
Please login to add a commentAdd a comment