PC: IPL Twitter
ఐపీఎల్-2023లో నిన్న మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ గెలుపుకు 6 పరుగులు అవసరం కాగా.. పంజాబ్ బౌలర్ అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి, చివరి బంతి వరకు కేకేఆర్‌కు విజయాన్ని దక్కనివ్వలేదు. అప్పటికి అర్షదీప్ తాను వేసిన 3 ఓవర్లలో 31 పరుగులు సమర్పించుకుని, అంచనాలు లేకుంగా బంతిని అందుకుని కేకేఆర్‌కు ముచ్చెమటలు పట్టించాడు.
తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని అర్షదీప్.. రెండు, మూడు బంతులకు సింగిల్స్, నాలుగో బంతికి డబుల్, ఐదో బంతికి వికెట్ తీసి, కేకేఆర్ గెలుపుకు ఆఖరి బంతికి 2 పరుగులు చేసేలా సమీకరణలు మార్చేశాడు. అర్షదీప్ కసి చూసి కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే స్ట్రయిక్‌లో రింకూ సింగ్ ఉండటంతో వారు విజయావకాశాలను సజీవంగా ఉంచుకున్నారు.
వారు ఊహించిన విధంగానే రింకూ సింగ్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గెలిచింది కేకేఆరే అయినప్పటికీ.. చేజారిందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన అర్షదీప్ కోట్లాది మంది అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. పంజాబ్ అభిమానులు తాము మ్యాచ్ కోల్పోయామన్న బాధను సైతం దిగమింగి అర్షదీప్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అర్షదీప్‌ను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అభివర్ణిస్తూ కొనియాడుతున్నారు. అర్షదీప్ నామస్మరణతో ప్రస్తుతం సోషల్‌మీడియా హోరెత్తిపోతుంది.
కాగా, అర్షదీప్‌కు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా కీర్తించబడటం ఇది కొత్తేమీ కాదు. గతంలో అతను పలు సందర్భాల్లో పంజాబ్‌తో టీమిండియాను గెలిపించాడు.. గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కొన్ని సందర్భాల్లో అర్షదీప్ అద్భుతంగా బౌల్ చేసి గెలిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో అర్షదీప్ అస్త్రాలు మిస్ ఫైరై జట్లు ఓటమిపాలయ్యాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్షదీప్ తన డెత్ ఓవర్ బౌలింగ్ స్కిల్స్‌తో పంజాబ్‌ను గెలిపించాడు.
ఇదిలా ఉంటే, పంజాబ్‌తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో కేకేఆర్ విజయం (20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి) సాధించింది. మ్యాచ్‌పై పట్టుసడలుతున్న తరుణంలో (ఆఖర్లో) రసెల్, రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి కేకేఆర్‌ను గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment