టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. సారథిగా, బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలవుతున్నాడు.
అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు ఇంత వరకు బోణీ కొట్టకపోవడంతో సూపర్-8 అవకాశాలు కూడా సంక్లిషంగా మారిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఆతిథ్య యూఎస్‌ఏ చేతిలో ఓటమి పాలైంది పాకిస్తాన్.
ఆ తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్‌లోనూ బాబర్ బృందానికి మరోసారి పరాభవం తప్పలేదు. న్యూయార్క్‌లో ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.
యూఎస్‌ఏతో పోటీపడాల్సిన దుస్థితి
సూపర్-8 దశకు అర్హత సాధించాలంటే పసికూన యూఎస్‌ఏతో పోటీపడాల్సిన స్థితిలో నిలిచింది. ఇక బాబర్ ఆజం వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. ప్రపంచంలోని మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరొందిన ఈ రైట్‌హ్యాండర్ ఈ ఐసీసీ ఈవెంట్ తాజా ఎడిషన్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.
యూఎస్‌ఏతో మ్యాచ్‌లో 44 పరుగులు చేయగా.. భారత్‌పై కేవలం 13 పరుగులకే బాబర్ పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెటర్లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.
ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ బాబర్ ఆజంను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్!
‘‘చాలా కాలం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. ప్లీజ్ బాబర్.. కెప్టెన్సీ వదిలేసెయ్! నువ్వొక క్లాస్ ప్లేయర్‌వి. నీలోని క్లాస్ మాత్రమే చూపించు.
అదనపు బాధ్యతలు, భారం నెత్తిన పెట్టుకోనట్లయితే ఇంకా ఎంతో బాగా ఆడగలవు. ఒకవేళ బాబర్ గనుక కెప్టెన్సీకి దూరంగా ఉన్నట్లయితే కచ్చితంగా అతడికి మంచే జరుగుతుంది’’ అని మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ బాబర్‌కు సూచించాడు.
బ్యాటింగ్, కెప్టెన్సీ మధ్య ఊగిసలాడవద్దని.. ఆటగాడిగా ఉండేందుకే మొగ్గుచూపాలని అతడికి విజ్ఞప్తి చేశాడు షోయబ్ మాలిక్. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఇటీవలే కెప్టెన్‌గా మరోసారి బాధ్యతలు
భారత్ వేదికగా ఎదురైన ఈ పరాభవానికి బాధ్యత వహిస్తూ ఈ మెగా టోర్నీ అనంతరం బాబర్ ఆజం కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అయితే, అనేక పరిణామాల అనంతరం తిరిగి పాక్ వన్డే, టీ20 జట్ల సారథిగా ఇటీవలే పునర్నియమితుడయ్యాడు.
ఇక కొత్తగా బాబర్ నాయకత్వంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 2-0తో ఓటమిపాలైన పాకిస్తాన్.. ప్రపంచకప్-2024 ఈవెంట్లోనూ తన పరాజయాలు కొనసాగిస్తోంది.
చదవండి: నువ్వేమీ గిల్‌క్రిస్ట్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి: సెహ్వాగ్
Comments
Please login to add a commentAdd a comment