వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్‌ ఖాన్‌కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌ | Pollard Is The Batter Who Hit Most Sixes Against Rashid Khan In A single Over In T20s | Sakshi
Sakshi News home page

వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్‌ ఖాన్‌కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్‌

Published Sun, Aug 11 2024 6:10 PM | Last Updated on Sun, Aug 11 2024 6:10 PM

Pollard Is The Batter Who Hit Most Sixes Against Rashid Khan In A single Over In T20s

హండ్రెడ్‌ లీగ్‌లో సథరన్‌ బ్రేవ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్‌ దిగ్గజం కీరన్‌ పోలార్డ్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్‌ 10) ట్రెంట్‌ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన పోలార్డ్‌.. క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు రెండుసార్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 

ఈ మ్యాచ్‌కు ముందు పోలార్డ్‌ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టీ20లో అఖిల ధనంజయం బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఓ సెట్‌లో (హండ్రెడ్‌ లీగ్‌లో ఐదు బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు)  ఐదుకు ఐదు సిక్సర్లు కొట్టాడు. పొట్టి క్రికెట్‌లో రషీద్‌ను ఈ స్థాయిలో చితక్కొట్టిన బౌలర్‌ కూడా లేడు. ఈ మ్యాచ్‌కు ముందు రషీద్‌ బౌలింగ్‌లో ఓ ఓవర్‌లో అత్యధికంగా నాలుగు సిక్సర్లు మాత్రమే వచ్చాయి. 

2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ డివిలియర్స్‌ రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2018 ఐపీఎల్‌లో క్రిస్‌ గేల్‌, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్కో జన్సెన్‌, 2024 ఐపీఎల్‌లో విల్‌ జాక్స్‌ రషీద్‌ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పోలార్డ్‌.. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఒక్కసారిగా గేర్‌ మార్చి సిక్సర్ల వర్షం​ కురిపించాడు. 127 పరుగుల ఛేదనలో​ 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్‌.. రషీద్‌ వేసిన 16వ సెట్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఐదు సిక్సర్లు బాదాడు. 

20 బంతుల్లో తన జట్టు విజయానికి 49 పరుగులు అవసరం కాగా.. పోలార్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్‌ బౌలింగ్‌ను ఊచకోత కోసి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న పోలార్డ్‌ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. పోలార్డ్‌ విధ్వంసం ధాటికి బ్రేవ్‌ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement