ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆదివారం సంచలన ఫలితం నమోదైంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో భాగంగా పుదుచ్చేరి ఆరు వికెట్ల తేడాతో పటిష్ట ముంబై జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అబ్బురపరిచిన పుదుచ్చేరి... ఆదివారం ముంబై జట్టును 19 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్యపరిచింది. 41 ఏళ్ల 129 రోజుల వయస్సున్న పుదుచ్చేరి మీడియం పేస్ బౌలర్ శాంత మూర్తి నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు.
శాంత మూర్తి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో ముంబై 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, ఆదిత్య తారే, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేశ్ లాడ్, సుజీత్ నాయక్‌లను శాంత మూర్తి అవుట్ చేశాడు. శాంత మూర్తి స్పెల్ ముగిశాక ముంబై మరో 52 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. 95 పరుగుల లక్ష్యాన్ని పుదుచ్చేరి 19 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని అందుకుంది. ఈ టోర్నీలో ముంబైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 19న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో ముంబై ఆడుతుంది.
టి20 క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన పెద్ద వయస్కుడిగా శాంత మూర్తి ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కెనూటి టులోచ్ (కేమన్ ఐలాండ్స్–41 ఏళ్ల 7 రోజులు) పేరిట ఉండేది. 2006 జూలైలో స్టాన్‌ఫర్డ్ టి20 టోర్నీలో భాగంగా సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టులోచ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment