‘పబ్‌జీ’ మొబైల్‌ గేమ్ సృష్టికర్త మృత్యువాత! | Popular-PubG-Mobile-Creator-Farooq-Ahmad-Demise-Car-Crash-Canada | Sakshi
Sakshi News home page

‘పబ్‌జీ’ మొబైల్‌ గేమ్ సృష్టికర్త మృత్యువాత!

Aug 28 2026 4:48 PM | Updated on Aug 28 2026 5:17 PM

Popular-PubG-Mobile-Creator-Farooq-Ahmad-Demise-Car-Crash-Canada

Photo Credit: Twitter

‘పబ్‌జీ (PUBG - Player Unknown's Battlegrounds)’.. ఈ ఆట గుర్తుండే ఉంటుంది కదా. పబ్‌జీ గేమ్ ఇప్పుడు చాలా దేశాల్లో నిషేధించినప్పటికీ 2019లో గేమింగ్ మోడ్‌తో ప్రపంచాన్ని శాసించింది. అప్పట్లో పిల్లల నుంచి పెద్దల దాకా పబ్ జీ గేమ్‌కు అలవాటు పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కొందరు ఈ ఆటలో బానిసలుగా మారి ప్రాణాలు విడిస్తే.. కొంతమంది మానసిక రోగాల బారిన పడ్డారు. పబ్‌జీ గేమ్ అనేది ఒక ప్రాణాంతక వీడియో గేమ్ అని భావించిన ప్రపంచ దేశాలు దీనిపై యుద్ధాన్ని ప్రకటించి తమ దేశాల్లో నిషేధం విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి.

మరి ఇప్పుడు పబ్‌జీ గేమ్ గురించి ప్రస్తావన ఎందుకంటే.. తాజాగా పబ్‌జీ మొబైల్‌ సృష్టికర్తల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ కారు యాక్సిడెంట్‌లో మృత్యువాత పడ్డాడు. కెనడాలోని కాల్గరీలో కారు, తాను ప్రయాణిస్తున్న మోటారుసైకిల్‌ను ఢీకొట్టడంతో, ప్రమాదంలో 28 ఏళ్ల ఫరూఖ్ అహ్మద్ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాగా ఫరూఖ్ అహ్మద్ మరణవార్తను పబ్ జీ మొబైల్ తన ఎక్స్ వేదికగా ప్రకటనను విడుదల చేసింది. 

"ఫరూఖ్, నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. పబ్‌జీ మొబైల్ కమ్యూనిటీ ఒక ఆత్మీయుడిని కోల్పోయాం. ఫరూఖ్ తన సేవలతో మన కమ్యూనిటీకి ఉత్సాహాన్ని అందించడంతో పాటు మరపురాని క్షణాలను అందించాడు. ఆయన మరణవార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి కుటుంబానికి, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి." అని పబ్‌జీ మొబైల్ తన సంతాపం వ్యక్తం చేసింది.

ఎవరీ ఫరూఖ్ అహ్మద్‌?
1998లో పాకిస్తాన్‌లో జన్మించిన ఫరూఖ్ అహ్మద్, దక్షిణాసియా, అంతర్జాతీయ పబ్ జీ మొబైల్ రంగాలలో తనదైన ముద్ర వేశారు. యూట్యూబ్‌లో 9,25,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 85,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆయన, పబ్‌జీ గేమ్‌కు అధికారిక మొబైల్ భాగస్వామిగా, కెనడియన్ అంబాసిడర్‌గా అధికారిక హోదాను పొందారు.

పబ్‌జీ అంటే?
పబ్‌జీ అంటే.. ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ (PUBG) అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే ముందుగా పబ్‌జీ యాప్‌ను మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే, ఈ ఆటను సింగిల్‌గా కాకుండా జట్టుగా ఆడితేనే మజా ఉంటుంది. 

దీంతో కొంతమంది టీమ్‌లుగా ఏర్పడి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే వ్యక్తి.. ఆ ఆటలో సైనికులుగా మారిపోతారు. ఆ తర్వాత వందకు పైగా శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది. ఒకసారి ఆట మొదలైందంటే.. యుద్ధంలో ఉన్నట్లే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆట ఆడేవారు పరిసరాలను మరిచిపోయి అందులో లీనమైపోతారు. ఈ ఆట పీసీ, ఎక్స్‌బాక్స్ వన్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లల్లో అందుబాటులో ఉంది.
 

Read: ఎలా అనుమ‌తిస్తారు? సంజ‌య్ బంగ‌ర్ కుమార్తెపై విమ‌ర్శ‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement