టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ దళ కూర్పు గురించి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్రాధాన్యం మాత్రం వీళ్లేనంటూ ముగ్గురు స్టార్ల పేర్లు చెప్పాడు.
అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్-2024 జూన్ 4 నుంచి ఆరంభం కానుంది. ఈవెంట్ మొదలైన మరుసటి రోజు టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఆఖరి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రోహిత్ సేన అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో తలపడుతోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్పిన్ విభాగం నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోగా.. తొలి రెండు మ్యాచ్‌లలో చైనామన్ బౌలర్ కుల్దీప్‌నకు తుదిజట్టులో చోటు దక్కలేదు.
రవి, అక్షర్, సుందర్ ఈ రెండు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అఫ్గన్‌తో ఆదివారం ముగిసిన రెండో టీ20లో అక్షర్ రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కలర్స్ షోలో మాట్లాడుతూ ప్రజ్ఞాన్ ఓజా అక్షర్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు.
బంతితోనూ, బ్యాటింగ్‌తోనూ రాణించగల ఈ ఆల్‌రౌండర్ అసలైన మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అక్షర్ సొంతమని ఓజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి కచ్చితంగా చోటివ్వాలని అభిప్రాయపడ్డాడు.
అదే విధంగా..."నా వరకైతే వరల్డ్ కప్ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలి. నంబర్ 1.. రవీంద్ర జడేజా. అతడి అనుభవం జట్టుకు ప్రయోజనకరం. ఇక రెండో బౌలర్.. రవి బిష్ణోయి, మూడో ఆటగాడు అక్షర్ పటేల్. క్లిష్ట పరిస్థితుల్లో తెలివిగా బౌలింగ్ చేయగలడు" అని మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు.
ఆ ముగ్గురికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. కుల్దీప్ యాదవ్‌ను మాత్రం విస్మరించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టుతో చేరనున్నాడు.
చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల
Comments
Please login to add a commentAdd a comment